రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలు, బాలికలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఐద్వా, ఎస్‌ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విద్యార్థినులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడారు. విశాఖపట్నంలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో ఐదు నెలల కాలంలో కర్నూలు, అనంతపురం, తిరుపతి, కడప వంటి ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన మద్యం షాపులను జన సమూహానికి, కళాశాలలకు దూరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి చంద్రిక, ఎస్‌ఎఫ్‌ఐ బాలికల విభాగం జిల్లా కన్వీనర్ రజిత, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వీరు, సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment