ఆహార భద్రతకు ‘ఆక్వా’ దోహదం
అనంతపురం అగ్రికల్చర్: ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, పోషణ విషయంలో మత్స్య సంపద (ఆక్వా రంగం) కీలకపాత్ర పోషిస్తోందని అసిస్టెంట్ కలెక్టర్ విన్నూత్న అన్నారు. గురువారం స్థానిక మత్స్యశాఖ ఉపసంచాలకులు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్య పరిశ్రమను వృద్దికారకం (గ్రోత్ ఇంజన్)గా గుర్తించినట్లు తెలిపారు. సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వాలు చేయూతను ఇస్తున్నాయన్నారు. జిల్లాకు సంబంధించి బీటీపీ, ఎంపీఆర్ డ్యాం, అప్పర్‌పెన్నార్ ప్రాజెక్టుల్లో ఉచితంగా 24.98 లక్షల చేపపిల్లల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు జిల్లా మత్స్యశాఖ డీడీ శ్రీనివాసనాయక్ తెలిపారు. అలాగే మత్య్సకార సొసైటీ సభ్యులకు 40 శాతం రాయితీతో 21 లక్షల చేపపిల్లలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా వ్యాప్తంగా 54 సొసైటీలు, 4,300 మంది మత్స్యకారులు ఉండగా... చేపల పెంపకానికి, వేటకు అనువుగా 99 చెరువులు, ఐదు రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు టర్నోవర్ జరగుతోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి (డీసీఓ) ఇ.అరుణకుమారి, మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షుడు నగేష్, కమిటీ సభ్యులు, ప్రాథమిక సొసైటీల అధ్యక్షుడు, మత్స్యశాఖ అధికారులు ఫక్కీరయ్య, ఆసీఫ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మత్స్య దినోత్సవంలో అసిస్టెంట్ కలెక్టర్ విన్నూత్న
Comments
Please login to add a commentAdd a comment