బీసీసీఐ అండర్–15 టోర్నీలో మెరిసిన జిల్లా అమ్మాయిలు
అనంతపురం: మహారాష్ట్రలో జరుగుతున్న అండర్ 15 బీసీసీఐ ఉమెన్ క్రికెట్ టోర్నీలో జిల్లాకు చెందిన అమ్మాయిలు మెరిశారు. గురువారం ఆంధ్ర, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జిల్లాకు చెందిన చక్రిక మూడు వికెట్లు సాధించి సత్తా చాటింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ జట్టు గెలుపులో కీలకంగా మారింది. 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించిన ఆంధ్ర జట్టులో బ్యాటర్లు దీక్ష 52 పరుగులు, పుష్పిత 42 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మహారాష్ట్ర జట్టు పది వికెట్ల నష్టానికి కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. ఎడమచేతి లెగ్ స్పిన్నర్ డి.చక్రిక ధాటికి మహారాష్ట్ర బ్యాటర్లు కంగుతిన్నారు. ఈ మ్యాచ్‌లో ఆమె మూడు వికెట్లు తీసింది. మరో బౌలర్ బి.తేజస్విణి (కుడి చేతి పేసర్) రెండు వికెట్లు తీసి ప్రతిభ చాటింది.
చిరుత దాడిలో గొర్రెల మృతి
కుందుర్పి: చిరుత దాడిలో రెండు గొర్రెలు మృతి చెందాయి. కుందుర్పి మండలం కెంచంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఈరన్న గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పాకలోకి చిరుత చొరబడడంతో గొర్రెలు బెంబేలెత్తి గట్టిగా అరవసాగాయి. దీంతో అప్రమత్తమైన ఈరన్న గట్టిగా కేకలు వేస్తూ పాక వద్దకు చేరుకుంటుండగా ఓ చిరుత సమీపంలోని పొదల్లోకి పరుగు తీసింది. పాకలోకి వెళ్లి పరిశీలిస్తే మృతి చెందిన రెండు గొర్రెలు కనిపించాయి. ఘటనతో రూ.25వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. కాగా, రెండు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రామాంజినేయులు పెంచుకున్న గేదెను చిరుత చంపి తినేసింది.
రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వే డీజిల్ షెడ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న ఎస్.డేవిడ్ ఇంట్లో చోరీ జరిగింది. గుంతకల్లులోని అరవిందనగర్ రైల్వేక్వార్టర్స్ 738–బీ లో నివాసముంటున్న ఆయన... ఈ నెల 16న తన సమీప బంధువు మృతి చెందడంతో ఇంటికి తాళం వేసి కర్నూలుకు వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండగులు ఇంట్లోకి చొరబడి విలువైన బంగారు నగలు, నగదు అపహరించుకెళ్లారు. గురువారం ఉదయం కాలనీ వాసులు గుర్తించి ఫోన్ చేసి తెలపడంతో ఆయన కర్నూలు నుంచి వచ్చి పరిశీలించారు. ఇంటి వెనుక ఉన్న ప్రహారీ దూకి లోపలకు ప్రవేశించిన దుండగులు తలుపులు ధ్వంసం చేసి, బీరువాలోని 4 తులాల బంగారు నగలు, రూ.10 వేలు అపహరించుకెళ్లినట్లు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలిచారు. ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment