జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
● సాగు, తాగునీరు,
పరిశ్రమలకు ప్రాధాన్యత
● జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి
టీజీ భరత్, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్
అనంతపురం అర్బన్: జిల్లా సమగ్రాభి వృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళుతున్నామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సాగు, తాగునీరుతో పాటు పరిశ్రమల స్థాపనను ప్రాధాన్యతాంశంగా నిర్దేశించుకున్నామన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో మంత్రి కేశవ్ అధ్యక్షతన జరిగిన డీఆర్‌సీ సమావేశంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కమిటీ ఉపాధ్యక్షురాలు, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, ఎస్పీ పి.జగదీష్ పాల్గొనగా.. రాప్తాడు, తాడిపత్రి ఎమ్మెల్యేలు పరిటాల సునీత, జేసీ అస్మిత్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తగినంత భూమి అందుబాటులో ఉండటంతో జిల్లా పరిశ్రమల హబ్‌గా మారనుందన్నారు. లాజిస్టిక్ హబ్ త్వరలో ఏర్పాటు కానుందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా పనిచేయాలన్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి, వాటికి ఎంత మేర భూమి సేకరించాలి అనే దానిపై కచ్చితమైన నివేదికలు అందించాలని చెప్పారు. అనంతరం తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలను ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు.
రైతులను ఆదుకోవాలి
జిల్లాలో కేవలం ఏడు మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం సరికాదని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నారు. పునఃపరిశీలన చేసి కరువు మండలాలను పెంచాలన్నారు. సుబ్బరాయసాగర్‌లో నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి ఉపాధి పథకం పనులకు అనుమతులివ్వాలన్నారు. ఉరవకొండ ప్రాంతంలో మిరప పంట అధికంగా సాగు చేస్తున్నారని, నల్లి బెడదతో పంట పూర్తిగా దెబ్బతింటున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు సరిగా అందడం లేదన్నారు. 104, 108 వాహనాలు సమయానికి రావడం లేదని, చాలా వరకు తిరగడం లేదని చెప్పారు. దీంతో అత్యవసర రోగులకు చిక్సిత అందని పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వైద్య సేవలు సత్వరం అందేలా చూడాలన్నారు. కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయి అధికారులు కూడా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment