31 వరకు కలెక్టర్ సెలవు
● ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా శివ్‌నారాయణశర్మ
అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఈనెల 31వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఇటీవలే ఆయన సతీమణి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కలెక్టర్ పెటర్నటీ సెలవు కోరుతూ లేఖ రాయగా, ఈనెల 31వ తేదీ వరకు మంజూరు చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. కలెక్టర్ వినోద్‌కుమార్ జనవరి 1వ తేదీన తిరిగి విధులకు హాజరవుతారు.
సబ్ జైలు తనిఖీ
గుత్తి: పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును బుధవారం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి శివ ప్రసాద్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల బ్యారెక్‌లు పరిశీలించారు. అదే విధంగా వంట గదులు, స్టోర్ రూమ్, బాత్ రూమ్‌లు, టాయిలెట్లు పరిశీలించారు. ఖైదీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 70 ఏళ్లకు పై బడిన వారు, అనారోగ్యానికి గురైన వారు ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, ఏడీజే శ్రీహరి, జైలర్ మహేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.
కందులు కొనుగోలు
చేయండి
అనంతపురం అర్బన్: రైతుల నుంచి రోజూ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధర ప్రకారం కందులు కొనుగోలు చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. కందుల కొనుగోలు అంశంపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో జిల్లాస్థాయి కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల కొనుగోలు కోసం గురువారం నుంచి ఆర్‌ఎస్‌కేల్లో రైతుల పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా డీఆర్ డీఏ, డీసీఓ, డీసీఎంఎస్ శాఖల అధికారులు సంయుక్తంగా పర్వవేక్షిస్తూ కందులు కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ గోదాముల వద్ద, కొనుగోలు కేంద్రాల్లో చేపట్టే కార్యకలాపాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కందుల కోసం అవసరమైన గోనె సంచులు, రవాణా, సరుకు భద్రపరిచేందుకు గోదాములు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి, డీసీఓ అరుణకుమారి, జిల్లా మార్కెటింగ్ అధికారి సత్యనారాయణ చౌదరి, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, డీటీసీ వీర్రాజు, ఎస్‌ఈఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘మామిడి’ ప్రీమియం
చెల్లించండి
అనంతపురం అగ్రికల్చర్: ఐదు సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న మామిడి తోటలకు వాతావరణ బీమా వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియం చెల్లించడానికి ఈ నెలాఖరు వరకు గడువిచ్చింది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో బీమా పథకం అమలు కానుంది. హెక్టారుకు రూ.82,500 పరిహారం ఖరారు చేసిన నేపథ్యంలో 15 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు తమ వాటా కింద 5 శాతం (రూ.4,125) భరిస్తే మిగతా 10 శాతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఈ నెల 15 నుంచి 2025 మే 31 వరకు బీమా వర్తించే కాలంగా పరిగణించారు. ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలు, ఈదురుగాలులు, తెగుళ్లు ఆశించే వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా విషయానికి వస్తే హెక్టారుకు రూ.90 వేలుగా ఖరారు చేశారు. 14 శాతం ప్రీమియంలో రైతులు తమ వాటా కింద 5 శాతం చెల్లిస్తే... మిగతాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment