● గరిష్టంగా 62 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగు
అనంతపురం అగ్రికల్చర్: రబీ మందకొడిగా ‘సాగు’తోంది. అధికారులు అంచనా వేసిన 1,18,330 హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 80 వేల హెక్టార్లలో పంటలు వేశారు. నల్లరేగడి భూములు కలిగిన మండలాల్లో ప్రధానపంట పప్పుశనగ 72,900 హెక్టార్లకు గానూ గరిష్టంగా 84 శాతంతో 62 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఇప్పటికే పప్పుశనగ సాగుకు సమయం ముగిసింది. ఇక విస్తీర్ణం పెరిగే పరిస్థితి లేదంటున్నారు. మరో ప్రధానపంట వేరుశనగ సాగుకు కూడా ఈనెల 15తో కాలం ముగిసిపోయింది. అయితే ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందలేదని చెబుతున్నారు. తాజా నివేదిక ప్రకారం 20,900 హెక్టార్లకు గానూ 6 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. అలాగే 7 వేల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన వరి ప్రస్తుతానికి వెయ్యి హెక్టార్లలో నాట్లు వేశారు. మిగతా పంటల విషయానికి వస్తే... జొన్న 3,800 హెక్టార్లు, మొక్కజొన్న 3,700 హెక్టార్లు, ఉలవ 3 వేల హెక్టార్లలో వేయగా సజ్జ, పెసర, మినుము, సోయాబీన్ తదితర పంటలు కొంత విస్తీర్ణంలో సాగు చేశారు. డిసెంబర్ నెలాఖరుతో రబీ పంటలు విత్తుకునేందుకు సమయం ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు వ్యవసాయశాఖ అఽధికారులు పంట నమోదు (ఈ–క్రాప్), ఈ–కేవైసీ ప్రక్రియ చురుగ్గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి 50 శాతం ఈ–క్రాప్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment