అనంతపురం: భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ అనంతపురం కోర్టు తీర్పు వెలువరించింది. వివరాలు... అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలలో నివాసం ఉంటున్న బత్తల శైలజ, బత్తల సురేంద్రబాబు అలియాస్ సూరి దంపతులు.పెళ్లి సమయంలో సురేంద్రబాబుకు వరకట్నం కింద రూ.లక్ష, 8 తులాల బంగారు నగలను శైలజ తల్లిదండ్రులు ఇచ్చారు. అనంతరం రూ.1.50 లక్షల అదనపు కట్నం తీసుకురావాలంటూ శైలజను శారీరకంగా వేధిస్తూ వచ్చాడు. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో 2019లో అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్‌ఐ నాగమధు అప్పట్లో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు వాదనలు అప్పటినుంచి కొనసాగుతూ వచ్చాయి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయి బత్తల సురేంద్ర బాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొబైల్ కోర్టు జడ్జి జె.సుజిన్ బుధవారం తీర్పు వెలువరించారు. కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను ఏపీపీ వి.శ్రీనివాసులు వినిపించారు.
21న హెచ్చెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నిక
అనంతపురం సెంట్రల్: సాగునీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా ఈనెల 21న హెచ్చెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ ఎన్. రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నగరంలోని హెచ్చెల్సీ లోక్ డివిజన్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 10.15 గంటల వరకూ చైర్మన్ పదవికి నామినేషన్ల స్వీకరణ, 10.30 గంటలకు నామినేషన్ల తుది జాబితా, 11.30లోపు ఎన్నికల ప్రక్రియ, 11.30 గంటలకు లెక్కింపు, చైర్మన్ ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. 12 గంటల నుంచి 1.15 గంటల మధ్య వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment