మానవాళి తప్పు.. అడవులకు ముప్పు
● జిల్లాలో తగ్గుతోన్న అటవీ విస్తీర్ణం
● రాయలసీమలోనే జిల్లాలో అత్యల్పంగా అడవులు
● కొండలు, గుట్టలు అంతరించి పోతున్నా పట్టించుకునే దిక్కులేదు
● రాష్ట్రంలోనే మేలిమి పశుగ్రాసం ‘ఉమ్మడి అనంత’లో లభ్యం
● జింకలు, చిరుత పులులకు పెట్టింది పేరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అసలే కరువు జిల్లాగా పేరుపొందిన జిల్లాలో అడవుల విస్తీర్ణం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అటవీ విస్తీర్ణం పరంగా రాయలసీమలోనే జిల్లా చివరస్థానంలో నిలుస్తోంది. రోజు రోజుకూ జిల్లాలో గుట్టలు, కొండలు మాయమవుతున్నాయి. యథేచ్ఛగా అటవీ సంపదను తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ముఖ్యంగా అటవీ పరిధిలోని గుట్టలను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నా అడిగే వారు కరువయ్యారు. అడవులు తగ్గుతున్న కొద్దీ వన్యప్రాణులు బిక్కుబిక్కుమంటూ జనారణ్యంలోకి వచ్చి ప్రమాదాలకు గురికావడం, వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం జరుగుతోంది.
వ్యవసాయ భూములుగా..
కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర వంటి కొన్ని ప్రాంతాల్లో అటవీ భూములను అక్రమంగా వ్యవసాయ భూములుగా మార్చుకుంటున్నట్టు విమర్శలొస్తున్నాయి. దీంతో రిజర్వు ఫారెస్టు విస్తీర్ణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న అటవీ విస్తీర్ణం ఇలా ఆక్రమణలకు గురవుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే వర్షపాతం తక్కువగా నమోదవుతున్న ఉమ్మడి జిల్లాకు... అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండటం తీవ్ర నష్టం కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు.
వన్యప్రాణులకు విఘాతం..
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కృష్ణ జింకలు, చిరుత పులుల అభివృద్ధి అనంతపురం, శ్రీ సత్యసాయి అడవుల్లోనే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మేలిమి జాతి పశుగ్రాసం ‘ఉమ్మడి అనంత’లో లభ్యమవుతున్నట్లు ఇందుకు కారణమని తేల్చారు. ఎలుగుబంట్లు, కుందేళ్లు, కొన్ని రకాల పాములు, తోడేళ్లు, నక్కలు వంటివీ ఇక్కడ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 3 వేలకు పైగా జింకలు ఉన్నాయని, 280 వరకూ చిరుతలు ఉన్నట్టు తాజా అంచనా. అడవుల విస్తీర్ణం తగ్గుతున్న కొద్దీ వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కాకుండా బయటవైపు చెట్ల పెంపకం అనుకున్నంత మేర జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడవుల విస్తీర్ణం పెరిగితే జంతుజాల సంరక్షణతో పాటు వర్షపాతం ఎక్కువగా నమోదు కావడానికి వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment