భూముల మార్కెట్ విలువ పెంపు
● 1 నుంచి అమలులోకి
● ఇన్‌చార్జ్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ శర్మ
అనంతపురం అర్బన్: ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం ప్రజలకు తెలిసే విధంగా రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకోవాలి’ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రిజిస్ట్రేషన్ శాఖ, అహుడా, మునిసిపల్ అధికారులతో మార్కెట్ విలువ సవరణ కమిటీ జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువ వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ https://registration.ap. gov.inలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అదే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. పెరిగిన భూముల మార్కెట్ విలువకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే ఈనెల 24వ తేదీలోగా తెలియజేయవచ్చన్నారు. 27వ తేదీన నిర్వహించే సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపుతామన్నారు. పెంచిన భూముల విలువలు జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు. సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మి, అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్, శ్రీ సత్యసాయి జిల్లా రిజిస్ట్రార్ కృష్ణకుమారి, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అహుడా కార్యదర్శి గౌరి శంకర్‌రావు, సబ్ రిజిస్ట్రార్లు, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి
ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ వర్గాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలన్నారు. వారు నివాసముండే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. చౌక దుకాణాలకు శాశ్వత డీలర్లుగా ఎస్సీ, ఎస్టీ వర్గాల నిష్పత్తి ప్రకారం ఈనెల 31వ తేదీలోగా నియామకం పూర్తి చేయాలన్నారు. కాంపోనెంట్ స్కీములకు సంబంధించి అర్బన్‌లో స్లమ్ ఫెడరేషన్ ఆర్‌పీలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ స్కీమ్‌లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలను రాబోయే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లా పరిషత్ నుంచి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సంబంధించిన నిధుల మంజూరుకు అనుమతులు వచ్చాయన్నారు. వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పాఠశాలలు, వసతి గృహాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో ఆర్‌డీఓ కేశవనాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రతాప్ సూర్యనారాయణరెడ్డి డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, సీపీఓ అశోక్‌కుమార్, డీపీఓ నాగరాజునాయుడు, హౌసింగ్ పీడీ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment