అనంతపురం ఎడ్యుకేషన్: జూనియర్ లెక్చరర్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం అనంతపురం వేదికగా ఆపస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎర్రిస్వామి అధ్యక్షతన జిల్లా కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. గతంలో విడుదల చేసిన జీఓ 302 ప్రకారం ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల టీచర్లకు ఇంటర్ తరగతులు బోధించేలా జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇచ్చేవారని గుర్తు చేశారు. జీఓ 223 తీసుకొచ్చి జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు లేకుండా చేశారన్నారు. 10 శాతం నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్‌లుగా ప్రమోషన్లు ఇస్తున్నారన్నారు. బీఈడీ అర్హత లేని కాంట్రాక్ట్ టీచర్లకూ అవకాశం కల్పిస్తున్నారన్నారు. అత్యంత అనుభవం కల్గిన ఉపాధ్యాయులకు ఎందుకు అవకాశం ఇవ్వరని ప్రశ్నించారు. వెంటనే 40 శాతం టీచర్లకు జేఎల్‌లుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఎర్రిస్వామి మాట్లాడుతూ... ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. హైస్కూల్ ప్లస్‌ను కొనసాగించి రెగ్యులర్ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కూళ్లలో ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలన్నారు. ఆంగ్ల మీడియంతో పాటు తెలుగు మీడియంనూ సమాంతరంగా కొనసాగించాలన్నారు. సమావేశంలో ఆపస్ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్దన్, కార్యదర్శి రమేష్, నాయకులు వెంకటేష్, పోతులయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment