విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

Published Thu, Dec 26 2024 2:39 AM | Last Updated on Thu, Dec 26 2024 2:38 AM

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

అనంతపురం కార్పొరేషన్‌: విద్యుత్‌ చార్జీలను పెంచబోమని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక భారీగా పెంచి నవంబర్‌లో రూ.6 వేల కోట్లు,డిసెంబర్‌లో రూ.9 వేల కోట్ల భారం ప్రజలపై మోపారని వైఎస్సార్‌ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 27న పిలుపునిచ్చిన ‘పోరుబాట’ను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యుత్‌ చార్జీలను పెంచారంటూ ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెట్టారన్నారు. వాస్తవంగా ప్రజలపై భారం పడకుండా జగనన్న చర్యలు తీసుకున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ను వ్యాపారం చేసిన బాబు.. లాభాపేక్షతో యూనిట్‌ విద్యుత్‌ను రూ.5.90కు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ ఉన్న సమయంలో సెకీ ద్వారా యూనిట్‌ను రూ.2.49కే కొనుగోలు చేసి రూ.87,500 కోట్ల భారం ప్రజలపై పడకుండా చూశారన్నారు. ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీల మినహాయింపు ద్వారా యూనిట్‌కు మరో రూ.2 రాయితీ ఇవ్వడం ద్వారా రూ.లక్ష కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. దేశానికే ఆదర్శంగా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జగనన్న చర్యలు తీసుకుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు కుట్ర పూరితమైన రాజకీయాలు చేశారన్నారు. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఎక్కువ ధరకు వీలైతే అంత ధరకు రాష్ట్ర ఖజానా నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి ప్రజలకు అన్యాయం చేశారన్నారు. విద్యుత్‌ను వ్యాపారంగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 27న పోరుబాట చేపట్టి రాప్తాడు నియోజకవర్గంలోని ఏఈ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

రూ.80 వేల కోట్లు ఏం చేశారు బాబూ?

కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి నెలా దాదాపు రూ.13 వేల కోట్ల చొప్పున గడిచిన ఆరు నెలల్లో రూ.80 వేల కోట్ల అప్పు చేశారని, ఆ డబ్బును ఎక్కడ ఖర్చు చేశారో సీఎం చంద్రబాబు చెప్పాలని ప్రకాష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. జగనన్న అమలు చేసిన ‘అమ్మఒడి’, ‘వైఎస్సార్‌ చేయూత’, ‘రైతు భరోసా’, ‘వైఎస్సార్‌ ఆసరా’, చేదోడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా తదితర పథకాలు ఇప్పుడు లేకుండా పోయాయన్నారు. ‘తల్లికి వందనం’ పేరుతో దగా చేశారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జగనన్న 43 లక్షల మంది తల్లులకు రూ.15,000 చొప్పున ఏటా రూ.6,500 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు తాగేందుకు చుక్క, ఆడేందుకు మట్కా, పేక ముక్క, వేసుకునేందుకు గుట్కా ఉండాలన్నదే చంద్రబాబు చిట్కా అని ఎద్దేవా చేశారు. కూటమి సర్కార్‌ చర్యలను ఎండగట్టే సమయం ఆసన్న మైందని, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో రామగిరి ఎంపీపీ నాగరాజు, వైఎస్సార్‌ సీపీ నాయకులు జూటూరు శేఖర్‌, అమర్‌నాథ్‌ రెడ్డి, రామాంజినేయులు, నీరుగంటి నారాయణ రెడ్డి, ఈశ్వరయ్య, నరసింహారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, వీరాంజనేయులు, ఈశ్వరయ్య, పార్టీ వలంటీర్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు హరినాథ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలపై కూటమి ప్రభుత్వం రూ.15 వేల కోట్ల భారం

చార్జీలు పెంచబోనంటూ ఇచ్చిన

మాట తప్పిన సీఎం చంద్రబాబు

వైఎస్సార్‌ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డి ధ్వజం

‘వైఎస్సార్‌ సీపీ పోరుబాట’ను విజయవంతం చేయాలని పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement