రైలులో నుంచి కిందపడిన విద్యార్థి
● సత్వరమే స్పందించి కాపాడిన రైల్వే పోలీసులు
బత్తలపల్లి: తిరుపతి నుంచి గుంతకల్లుకు ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు కిందపడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సత్వరమే స్పందించి ఆమెను కాపాడారు. ఆర్‌పీఎఫ్ సీఐ బోయ కుమార్ తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన బోయ నాగరాజు కుమార్తె బోయ హరిత అన్నమయ్య జిల్లా మదనపల్లి వద్ద ఉన్న కలికిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. క్రిస్మస్ సెలవులు రావడంతో బుధవారం తన సోదరుడు గిరిబాబుతో కలసి స్వగ్రామానికి వెళ్లడానికి గుంతకల్లు ప్యాసింజర్ రైలు ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న రైలు ముదిగుబ్బకు చేరగానే హరిత వాష్‌రూంకు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె రాకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె వద్దనున్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా బత్తలపల్లి మండలం చిన్నేకుంటపల్లి–డి.చెర్లోపల్లి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సెక్షన్‌లోని ఆన్ డ్యూటీ కీమెన్ మస్తాన్‌ను అప్రమత్తం చేయడంలో ఆయన అక్కడికు పరిశీలించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన హరితను 108 అంబులెన్స్‌లో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు ప్రాథమిక విచారణ తేలింది. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడినట్లు ఆర్డీటీ వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment