‘కరువు’ నివేదిక సిద్ధం చేయండి
అనంతపురం అర్బన్: ‘కరువు పరిస్థితులు అంచనా వేసేందుకు జిల్లాకు కేంద్ర బృందం విచ్చేయనుంది. జనవరి 2, 3 తేదీల్లో జిల్లాలో బృందం పర్యటి స్తుంది. ఈ నేపథ్యంలో సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయండి’ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అనంతపురం, నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, యాడికి, విడపనకల్లు మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. అప్పటి కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఆయా మండలాల్లో పర్యటించనుందన్నారు. ఈ దృష్ట్యా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. బృందం సభ్యులకు వసతి, వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. కరువు పరిస్థితి తెలియజేసేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కరువు మండలాల్లో కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. కరువు మండలాల్లో తాగునీటి సమస్యలు, జల్ జీవన్ మిషన్ పనులు, ఉపాధి హామీ కింద లేబర్ బడ్జెట్ తయారీ, పనుల కల్పన, భూగర్భజలాల పరిస్థితి తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమన్వయంతో పనిచేసి కేంద్ర బృందం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, సీపీఓ అశోక్‌కుమార్, డ్వామా పీడీ సలీంబాషా, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఉద్యాన శాఖ డీడీ నరసింహరావు, డీపీఎం ఆనంద్, హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ రాజశేఖర్, భూగర్భజల శాఖ ఏడీ జయరామిరెడ్డి, ఐసీడీఎస్ పీడీ వనజ అక్కమ్మ, ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎంఈ సర్వే వేగవంతం చేయాలి
‘‘ఎంఎస్‌ఎంఈ యూనిట్ల సర్వే చేయడంలో మీ పనితీరు సరిగ్గా లేదు. నవంబరు 29న ప్రారంభమైతే ఇప్పటికీ 18 శాతం మాత్రమే పూర్తయ్యింది. ఇలాగైతే ఫిబ్రవరి 1వ తేదీకి ఎలా పూర్తి చేస్తారు.’’ అంటూ ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి డీఎల్‌డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, డీసీఓ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 89,500 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉంటే ఇప్పటి వరకు 14 వేలు యూనిట్ల సర్వే జరిగిందన్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వేతో పరిశ్రమలు, సేవారంగాలు, వ్యాపార సంస్థలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. బ్యాంకు రుణం పొందడానికి అర్హులవుతారన్నారు. ‘ఉద్యమ్’ పోర్టల్‌లో యూనిట్ వివరాలు నమోదు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలు పొందడానికి వీలవుతుందన్నారు. ఈ విషయాన్ని యూనిట్ల యజమానులకు తెలియజేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్, డీసీఓ అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment