‘గ్రౌండ్ వాటర్’ ఇన్‌చార్జ్ డీడీగా జయరామిరెడ్డి
అనంతపురం
అగ్రికల్చర్: భూగర్భ జలశాఖ (గ్రౌండ్ వాటర్) ఇన్‌చార్జ్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా జయరామిరెడ్డి గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ డీడీగా ఉన్న కె.తిప్పేస్వామి వ్యక్తిగత కారణాలతో నెల రోజుల పాటు సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఇరిగేటెడ్ గ్రౌండ్‌వాటర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన జయరామిరెడ్డికి బాధ్యతలు అప్పజెబుతూ ఆ శాఖ రాష్ట్ర డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో స్థానిక ఆ శాఖ కార్యాలయంలో జయరామిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 2, 3 తేదీల్లో కేంద్ర బృందం రానుండటంతో కరువు జాబితాలో ప్రకటించిన 7 మండలాల్లో భూగర్భజలాల స్థితిగతుల వివరాలు, అలాగే గత వంద సంవత్సరాల వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిపై ఫొటో ప్రదర్శన ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నెలవారీగా ఫిజీమీటర్ల నుంచి నీటిమట్టం సేకరణ, వాల్టా చట్టం అమలు తదితర వాటిపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.
ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాసులు నాయక్
● పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా భోగతి విజయ ప్రతాప్ రెడ్డి
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షునిగా యం. శ్రీనివాసులు నాయక్(శింగనమల నియోజకవర్గం) నియమితులయ్యారు. అలాగే, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా భోగతి విజయ ప్రతాప్ రెడ్డి(శింగనమల)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
నేడు బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక
బత్తలపల్లి: స్థానిక ఆర్డీటీ క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లా బాలబాలికల జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.రామ్‌తేజ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్, కార్యదర్శి రాగిరి రామయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కర్నూలు కేఈ ఫామ్ హౌస్‌లో 50వ మూలపురి రంగారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ చాంపియన్స్‌షిప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. బాలుర బరువు 70 కేజీలు, బాలికలు 65 కేజీలలోపు ఉండాలని, ఒరిజనల్ పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపిక పోటీలు మ్యాట్‌పై నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు మ్యాట్ షూ ధరించాలని తెలిపారు.
బీఎల్‌ఓలకు
గౌరవ వేతనం మంజూరు
అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణ, ఎన్నికల విధులు నిర్వర్తించిన బూత్ లెవల్ అధికారులకు బకాయి ఉన్న గౌరవ వేతనం రూ.3.15 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,750 మంది బీఎల్‌ఓలకు మూడో త్రైమాసిక గౌరవ వేతనం రూ.750 చొప్పున, నాల్గో త్రైమాసి కానికి రూ.1,500 చొప్పున రూ.84,37,500 మంజూరు చేసింది. అదే విధంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలకు కలిపి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున 2,198 మందికి రూ. 1.31 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంఽధించి మూడు త్రైమాసికాలకు కలిపి ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున రూ.99,58,500 విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment