30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
అనంతపురం:స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఈ నెల 30 నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 17వరకూ ప్రక్రియ సాగనుంది. పురుష అభ్యర్థులు 5,242, మహిళా అభ్యర్థులు 1,237 మంది మొత్తం 6,749 మంది హాజరుకానున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను అభ్యర్థులు తీసుకురావాల్సి ఉంటుంది.
పకడ్బందీగా ప్రక్రియ..
దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై పోలీసు అధికారులు, ఐటీ కోర్ టీంతో ఎస్పీ పి. జగదీష్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏపీ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌ఆర్‌బీ) ఆదేశాలు, నియమ నిబంధనల మేరకు పరీక్షలు సవ్యంగా జరిగేలా ప్రణాళి సిద్ధం చేశామన్నారు. పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సర్టిఫికెషన్ వెరిఫికేషన్ నుంచి బయోమెట్రిక్ అథెంటిఫికేషన్, దేహదారుఢ్య పరీక్షలు, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగుల పంపిణీ, 1,600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, వెరిఫికేషన్స్ 2 (స్పెషల్ బెనిఫిట్స్, లోకల్ స్టేటస్), రిజల్ట్ కౌంటర్ వరకు సమగ్రంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఇలియాజ్ బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేశ్, రవిబాబు, శ్రీనివాస్, రామకృష్ణుడు, నీలకంఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment