అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్ శాఖ, సహకారశాఖ సంయుక్తంగా చేపట్టిన మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్షన్ గోడౌన్ల నిర్మాణాలు టార్గెట్ మేరకు పూర్తి చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు అప్పగించాలని మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ విజయసునీత ఆదేశించారు. గురువారం జిల్లాకు విచ్చేసిన డైరెక్టర్ రెండు జిల్లాల పరిధిలో చేపట్టిన గోడౌన్ల గురించి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో 101 గోడౌన్లకు గానూ 53 పూర్తి చేసి, అందులో 46 గోడౌన్లను పీఏసీఎస్‌లకు అప్పగించినట్లు తెలిపారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో 87 గోడౌన్లకు గానూ 60 పూర్తి చేసి అందులో 50 గోడౌన్లకు పీఏసీఎస్‌లకు అప్పగించామని డీఈ రఘునాథ పేర్కొన్నారు. ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.40 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ విజయసునీత మాట్లాడుతూ మిగిలిన గోడౌన్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సొసైటీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా వృథాగా ఉండకుండా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు లేదా ఇతరత్రా అద్దె ప్రాతిపదికన ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం పాలసముద్రం, మరూరు, ఏ.నారాయణపురంలో నిర్మించిన గోదాములను పరిశీలించారు. కాగా, జిల్లాకు విచ్చేసిన మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయసునీతను అనంతపురం ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ఆర్జేడీ సి.రామాంజినేయులు, డీడీ శ్రీకాంత్‌రెడ్డి, ఏడీఎంలు పి.సత్యనారాయణచౌదరి, ఎల్‌ఎన్ మూర్తి, పీఏసీఎస్ సీఈఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment