అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ వ్యవస్థతో అన్ని వర్గాలకూ కష్టాలు
చుక్కలు చూపుతున్న బాబు
విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్యుల విలవిల
వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతుల ఎదురుచూపు
విద్యుత్ స్తంభాలు, కండక్టర్‌లూ అందించని కూటమి ప్రభుత్వం
కేబుల్ లేక నిలిచిన 636 కిలోమీటర్ల పనులు
ఎనిమిది మాసాల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు రాప్తాడుకు వచ్చారు. ‘‘కరెంటు చార్జీలు పెంచను. మీ పొలంలో మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని వేరే వాళ్లకు అవసరమైతే ఇవ్వొచ్చు’’ అంటూ అలవిగాని హామీలు గుప్పించారు.
కానీ పాలనా పగ్గాలు చేపట్టి ఆరు మాసాలు గడవకముందే కోలుకోలేని ‘షాక్’ ఇచ్చారు. సామాన్యుల నడ్డి విరుస్తూ కరెంటు చార్జీల భారం మోపారు. కూటమి సర్కారు నిర్ణయాలకు సామాన్యులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, రైతులు కూడా విలవిలలాడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీల పెంచడంతో 6.22 లక్షల కుటుంబాలపై తీవ్ర భారం పడింది. ఒక్కసారిగా బిల్లు రెండింతలు పెరగడంతో సామాన్యులు ఘొల్లుమంటున్నారు. ఎన్నికల ముందు చార్జీలు పెంచబో మంటే ఎంతో సంతోషించామని, కానీ, నేడు మోయలేని భారం మోపి చుక్కలు చూపిస్తున్నారని వాపోతున్నారు. బిల్లు కట్టడం నాలుగు రోజులు ఆలస్యమైతే కరెంటు కనెక్షన్ తొలగిస్తుండటంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతా అస్తవ్యస్థం..
గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టారు. కరెంటు కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేశారు. కొత్త లైన్లు, కొత్త సబ్‌స్టేషన్లు ఇలా ఒకటేమిటి రమారమి ఐదేళ్లలో రూ.1,642 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.
కరెంటు స్తంభాలకు కూడా దిక్కులేని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 24,600 విద్యుత్ స్తంభాలు అవసరం ఉండగా, వాటిని ఏర్పాటు చేయడానికి డబ్బుల్లేవని చెబుతున్న దుస్థితి. ఇక 2,149 కిలోమీటర్ల మేర కండక్టర్‌లు లేవని విద్యుత్ శాఖ తేల్చింది. అంతేకాదు విద్యుత్ కేబుల్ లేక 636 కిలోమీటర్ల మేర పనులు స్తంభించిపోయాయి. వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు పోళ్లు, కేబుల్, కండక్టర్లు అందించడంలో అంతులేని అలసత్వం వెరసి ఆరు మాసాల్లోనే విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపం కూటమి సర్కారుదేనని సామాన్యులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment