● ఏడుగురికి గాయాలు
బత్తలపల్లి: రోడ్డుపై బోల్తాపడిన ఆటోను మరో ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రి మండలం నిడిగల్లులో ఉన్న చర్చి నిర్వాహకులు క్రిస్మస్ పండుగ సందర్భంగా చికెన్ తీసుకువచ్చేందుకు ఆటోలో బుధవారం ఉదయం ధర్మవరానికి బయలుదేరారు. బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన పల్లంలోకి వెళ్లింది. దీంతో ఆటోను తిరిగి రోడ్డుపైకి ఎక్కించే ప్రయత్నంలో రాయిని ఢీ కొనడంతో బోల్తా పడింది. అదే సమయంలో ముదిగుబ్బ మండలం వలిమిచెర్లోపల్లిలో సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన కొత్తపల్లి బాలరాజు తన భార్యతో కలసి వెళుతున్న ఆటో ఢీకొంది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో నిడిగల్లు ఆటో డ్రైవర్ బీదల సంతోష్, చిన్నగాని తొలంద్ర బాబు, నరేంద్ర, మామిళ్లపల్లి ఆటో డ్రైవర్ కొత్తపల్లి బాలరాజు, ఆయన భార్య శ్రావణితో పాటు బత్తలపల్లి వరకూ ఆటోలో ప్రయాణిస్తున్న దుగ్గెన్న (ధర్మవరం పట్టణం బోయవీధి), ఆర్డీటీ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో పని చేస్తున్న యమున (ధర్మవరం మండలం నాగలూరు గ్రామం) గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం దుగ్గెన్నను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న బత్తలపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment