‘కాంట్రాక్టు’ దొంగ!
● పట్టపగలే ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి యత్నం
● రైతు రావడంతో పరారైన వైనం
కళ్యాణదుర్గం రూరల్: పట్టపగలే వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగిలించాలని చూశాడో ఘనుడు. అతను విద్యుత్ కాంట్రాక్టర్ అని బాధిత రైతు తెలపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బాధితుడి వివరాల మేరకు... కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడఘట్ట గ్రామ సమీపంలో నల్లబోతుల వెంటు వ్యవసాయ పొలం ఉంది. గతంలో పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం కొంతమంది వెంటు పొలంలోకి చొరబడ్డారు. బొలెరో వాహనం, జేసీబీ కూడా తీసుకొచ్చారు. జేసీబీతో ట్రాన్స్‌ఫార్మర్ తొలగించేందుకు యత్నిస్తుండగా వెంటు అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్ సాబ్జాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడు 100కు డయల్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకుని కూలీలను విచారించారు. ట్రాన్స్‌ఫార్మర్ తీసుకెళ్లేందుకు తమను కాంట్రాక్టర్ సాబ్జాన్ తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు జేసీబీని, బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ఆ తర్వాత కొంతసేపటికే వదిలేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. కాంట్రాక్టర్ సాబ్జాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ టీడీపీ ముఖ్య నేతలు పోలీసులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. కాగా, ఈ ఘటనపై పట్టణ సీఐ యువరాజ్ వివరణ కోరగా డయల్ 100 ద్వారా అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment