సెమీస్‌కు మహారాష్ట్ర
అనంతపురం: బీసీసీఐ, ఏసీఏ సంయుక్తంగా అనంత క్రీడాగ్రామం వేదికగా నిర్వహించిన అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై మహారాష్ట్ర జట్టు విజయకేతనం ఎగురవేసి సెమీస్‌కు అర్హత సాధించింది. మహారాష్ట్ర బ్యాటర్లు సుహ్రుత్ సావంత్ 295 బంతుల్లో 117 (19 ఫోర్లు), నిఖిల్ లునావత్ 229 బంతుల్లో 100 (16 ఫోర్లు) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగుల ఆధిక్యత సాధించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులతో ఆట మొదలు పెట్టిన మహారాష్ట్ర జట్టు ఆట ముగిసే సమయానికి మరో వికెట్ కోల్పోకుండా 305 పరుగుల భారీ స్కోరు చేసింది. ముగింపు కార్యక్రమానికి బీసీసీఐ సెలెక్టర్ హర్విందర్ సింగ్ సోదీ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో ఏసీఏ ఏజీఎం డి. శివకుమార్, మ్యాచ్ రెఫరీ మిహిరా, ఏడీసీఏ కార్యదర్శి భీమలింగారెడ్డి, సౌత్ జోన్ అకాడమీ అడ్మినిస్ట్రేటీవ్ మేనేజర్ పీకే సాగర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రేపు గవిమఠం 7వ పీఠాధిపతుల పుణ్యారాధన
ఉరవకొండ: ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవిమఠం 7వ పీఠాధిపతులు జగద్గురు కర్తృ కరిబసవ రాజేంద్ర మహాస్వాముల వారి 33వ పుణ్యారాధన కార్యక్రమం ఈ నెల 27న నిర్వహించనున్నారు. ఈ మేరకు మఠం మేనేజర్ రాణి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మఠం ప్రస్తుత పీఠాధిపతి జగద్గురు చెన్నబసవరాజేంద్ర మహాస్వాముల నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదానం ఉంటుంది.
మహిళలకు కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు
రాప్తాడు: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలోని ఎస్‌ఎల్‌సీ (సెల్ఫ్ లర్నింగ్ సెంటర్)లో నిరుద్యోగ మహిళలకు 45 రోజుల పాటు కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఎంటీఎల్ ఇంద్రజ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ టాలీ, ఎంఎస్ ఆఫీస్, తెలుగు, ఇంగ్లిష్ టైపింగ్, లైఫ్ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్స్, బేసిక్ స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ రిలేషన్‌షిప్ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఏదైనా డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి, 20 నుంచి 35 ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. ఆసక్తి ఉన్న వారు రూ.2 వేలు రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 73969 50345, 91001 02811లో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment