● నేడు హెచ్చెల్సీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎంపిక
● అనంతపురం, వైఎస్సార్ జిల్లా కమిటీ చైర్మన్ల మధ్య పోటీ
అనంతపురం సెంట్రల్: సాగునీటి సంఘాల ఎన్నికల్లో కీలకమైన ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియను అనంతపురంలోని హెచ్చెల్సీ కాలనీ సమీపంలో ఉన్న లోకలైజేషన్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు పాల్గొని ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ను ఎన్నుకోనుండడంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
రెండు జిల్లాల మధ్యే ప్రధాన పోటీ
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కీలకమైన ఘట్టాన్ని శనివారం అధికారులు ఎదుర్కోబోతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికలను ఏకపక్షంగా జరుపుకోవడంలో ఇప్పటి వరకూ కూటమి పార్టీ విజయం సాధించింది. అన్ని డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధికార పక్ష మద్దతుదారుల వశమయ్యాయి. ఈ క్రమంలో ముఖ్యమైన ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకునే అంశంలో అనంతపురం, వైఎస్సార్ జిల్లా చైర్మన్‌లు జోరుగా పావులు కదుపుతున్నారు. అనంతపురం జిల్లా పరిధిలో ఐదు, కర్నూలు జిల్లాలో ఒకటి, వైఎస్సార్ జిల్లాలో ఆరుగురు చొప్పున డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు ఉన్నారు. నీటి కేటాయింపుల్లో, నామినేషన్ పనులు చేపట్టడంలో చైర్మన్‌కు కొన్ని అధికారులుంటాయి. రూ. 5 లక్షల లోపు పనులు మంజూరు చేసే అధికారం కూడా చైర్మన్ చేతుల్లోనే ఉంటుంది. దీంతో చైర్మన్ గిరి దక్కించుకోవడానికి రెండు జిల్లా ప్రజాప్రతినిధులు రంగంలో దిగారు. ఇప్పటి వరకూ ఎక్కువ శాతం వైఎస్సార్ జిల్లా వారే చైర్మన్‌గా ఉంటూ వచ్చారు. ఈ సారి ఎలాగైనా అనంతపురానికి అవకాశం దక్కేలా చూడాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఫోర్జరీ సంతకాలతో రేషన్ బియ్యం పక్కదారి!
ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో పెద్దఎత్తున పట్టుబడిన రేషన్ బియ్యం కేసులో అక్రమార్కులకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అండగా నిలిచారు. ఇందుకు గాను డీటీ, పోలీస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బియ్యాన్ని పక్కదారి పట్టించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు...ఈ ఏడాది అక్టోబర్ 8న ఉరవకొండ శివారులోని రాములమ్మ ఆలయం వద్ద ఐచర్ వాహనం, ఆటోల్లో రేషన్ బియ్యాన్ని లోడ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న అప్పటి సీఐ సురేష్‌బాబు, పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. 140 బస్తాల్లో 68 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అనంతరం పీఎస్‌లో అంతా తానై దుప్పటి పంచాయితీలకు తెరలేపే ఓ కానిస్టేబుల్ ఈ అంశంలో జోక్యం చేసుకుని అధికారులకు తెలియకుండా డిప్యూటీ తహసీల్దార్, అప్పటి సీఐ సంతకాన్ని ఫోర్జరీ చేసి 68 క్వింటాళ్ల బియ్యంలో కేవలం 30 క్వింటాళ్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు చూపించాడు. మిగిలిన 38 క్వింటాళ్ల బియ్యాన్ని పక్కదారి పట్టించాడు. ఈ వ్యవహారంలో ఓ వీఆర్వో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోర్జరీ వ్యవహారం రెండు రోజుల క్రితం వెలుగుచూడడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేపట్టారు. దీనిపై తహసీల్దార్ మహబూబ్‌బాషాను వివరణ కోరగా ఫోర్జరీ సంతకాలతో బియ్యాన్ని పక్కదారి పట్టించిన వైనం వాస్తవమేనని నిర్ధారించారు. దీనిపై విచారణ జరిపించి నివేదికను జాయింట్ కలెక్టర్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు.
ప్రేమికుల ఆత్మహత్య
పావగడ: జీవితంపై విరక్తితో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం వెంకటమ్మనపల్లికి చెందిన గోవిందరెడ్డి, లక్ష్మీదేవి (బధిరురాలు) బతుకు తెరువు కోసం కొన్నేళ్లుగా బెంగళూరులోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన జ్యోతి(30)తో గోవిందరెడ్డి (35) వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. గురువారం పావగడకు వచ్చిన వారు రాత్రి స్థానిక ఓ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చెళ్లకెరె క్రాస్ వద్దకు చేరుకుని బయలు ప్రదేశంలో మద్యంలో విషపూరిత ద్రావకం కలుపుకుని తాగారు. అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పావగడ పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జ్యోతి మరణించినట్లు నిర్ధారించుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న గోవిందరెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఉదయం 11 గంటలకు గోవిందరెడ్డి మృతి చెందాడు. జ్యోతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment