రాప్తాడుపై తపోవనం జట్టు విజయం
బత్తలపల్లి: రూరల్ క్రికెట్ సూపర్ లీగ్‌లో రాప్తాడు జట్టుపై తపోవనం జట్టు వంద పరుగుల తేడాతో విజయం సాధించింది. బత్తలపల్లి ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో శనివారం అండర్–15 బాలుర విభాగం క్రికెట్ పోటీల్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తపోవనం జట్టు 40 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 208 పరుగులు చేసింది. బ్యాటర్లు తన్మయికార్తీక్‌రెడ్డి 60, అభినవ్‌సాల్విక్ 51 పరుగులతో రాణించారు. అనంతరం 209 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాప్తాడు జట్టు తపోవనం బౌలర్ కుశాల్‌రాయల్ దెబ్బకు విలవిలలాడింది. 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాప్తాడు జట్టులో ఫణి 41 పరుగులు చేశాడు. వంద పరుగుల తేడాతో తపోవనం జట్టు గెలుపొంది.
చెట్టుకొమ్మ పడి కూలీ దుర్మరణం
కుందుర్పి: చెట్టు కోస్తున్న సమయంలో ఓ కొమ్మ విరిగి మీదపడటంతో కూలీ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం కొలిమిపాళ్యం గ్రామానికి చెందిన దినసరి కూలీ రామ్మూర్తి (35) శనివారం ఉదయం కర్ణాటక సరిహద్దులోని కదిరేపల్లిలో వేపచెట్టు కోసేందుకు వెళ్లాడు. అక్కడ చెట్టు కోస్తున్న సమయంలో ఒక పెద్ద కొమ్మ అకస్మాత్తుగా ఒరిగింది. తప్పించుకునేలోపే మీద పడడంతో రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నారా లోకేష్‌పై కేసు నమోదు చేయాలి
అనంతపురం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిస్తున్న మంత్రి నారా లోకేష్‌పై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడదల రజనిపై అసభ్యకరంగా పోస్టులు పెడుతూ కించపరుస్తున్నారని అందులో పేర్కొన్నారు. మతపరమైన విద్వేషాలను కూడా రెచ్చగొడుతూ సమాజంలో అశాంతి రేపేందుకు కుట్ర చేసే రీతిలో వ్యవహరిస్తున్న ఐటీడీపీ సభ్యులతో పాటు, వీరికి నాయకత్వం వహిస్తున్న నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జి.రాజేష్‌రెడ్డి, అనిల్‌కుమార్ గౌడ్, శ్రీనివాసులు, రషీద్, పార్వతి, జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఆధునికీకరణకు రూ.500 కోట్లు ఇవ్వాలి
అనంతపురం అర్బన్: తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణకు రూ.500 కోట్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునికీకరణ చేపట్టడం ద్వారా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు 30 టీఎంసీల నీరు వస్తుందన్నారు. రూ.500 కోట్లు అవసరం ఉంటే రూ.35 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నిధులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు సరిపోతాయని ఎద్దేవా చేశారు. ఇక పేదలకు పక్కా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపుపై జనవరి 2 నుంచి 11 వరకు సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సీపీఐ స్థాపించి ఈ నెల 26కు 100 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో శత వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, నాయకులు రాజారెడ్డి, మల్లికార్జున, కేశవరెడ్డి, శ్రీరాములు, రాజే ష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల కృషితోనే గుత్తి డీజిల్‌షెడ్ అభివృద్ధి
గుత్తి: కార్మికుల కృషి, కష్టం ఫలితంగానే గుత్తి లోకో రైల్వే డీజిల్‌షెడ్ అంచలంచెలుగా అభివృద్ధి సాధించిందని గుంతకల్లు డీఆర్‌ఎం విజయ్‌కుమార్ పేర్కొన్నారు. డీజిల్‌షెడ్ 61వ వార్షికోత్సవాలను శనివారం రైల్వే అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. డీఆర్‌ఎంతో పాటు ఏడీఆర్‌ఎం సుధాకర్, సీఎంఎస్ వేణుగోపాల్‌రెడ్డి, గుత్తి డీజిల్‌షెడ్ సీనియర్ డీఎంఈ ప్రమోద్, డీఎన్‌ఏ మంగాచారి, గ్యారేజీ వర్క్‌షాప్ సీనియర్ డీఎంఈ ముఖేష్, గుత్తి, గుంతకల్లు ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ప్రియాంక, మాధవి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో రైల్వే అధికారులకు, కార్మికులకు అఽతిథులు బహుమతులు ప్రదానం చేశారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ ఏ కొత్త లోకో బయటకు వచ్చిన ముందుగా గుత్తి డీజిల్‌షెడ్‌కు పంపుతారన్నారు. కార్యక్రమంలో అన్ని రైల్వే యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment