వాతావరణ ఆధారిత సాగుతో మేలు
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ పరిస్థితుల ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని, ఆ దిశగా ఏఎఫ్ ఎకాలజీ చేపట్టిన ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ‘క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ప్రోగ్రాం’పై ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ప్రతినిధులతో కలిసి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకాలజీ సెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూ కుందుర్పి, శెట్టూరు, కళ్యాణదుర్గం, ఆత్మకూరు మండలాల పరిధిలో యర్రబోరేపల్లి, ముచ్చర్లపల్లి, లింగదార్లహళ్లి, మందలహళ్లి, బండమీదపల్లి, మహంతపురం, అల్లాపురం, విట్లంపల్లి, ఎం.వెంకటాంపల్లి, పి.కొత్తపల్లి తదితర 10 గ్రామాలను ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలియజేశారు. కూడేరు మండలంలో ఒక గ్రామాన్ని త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయం, పాడి, పశుపోషణ, ఉద్యానతోటలు, ఇతరత్రా జీవనోపాధులపై అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు, వర్షాలు, ఉష్ణోగ్రతలు, నేల రకాలను విశ్లేషిస్తామన్నారు. ఆ తర్వాత సమగ్ర ప్రణాళిక తయారు చేసి ఎప్పుడు ఏ పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేయడంతో పాటు పశుపోషణ, ఉద్యాన రంగం, సూక్ష్మసాగు పద్ధతులు తదితర అంశాల్లో ప్రోత్సహిస్తామన్నారు. ఐదేళ్ల పాటు సాగే ఈ ప్రాజెక్టులో ఏఎఫ్ ఎకాలజీకి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సహకరిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇన్‌చార్జ్ కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో జిల్లా అంతటా అమలు చేయడానికి దోహద పడుతుందన్నారు. రైతులు, కూలీలు, ఇతరత్రా అన్ని వర్గాలకు ఎంతగానో మేలు జరిగే ప్రాజెక్టు విజయవంతానికి అందరూ సహకరించాలని సూచించారు. గ్రామ నమూనాలు తయారు చేసి ఆయా శాఖల అధికారులు 8 మందితో టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి హాజరై ప్రాజెక్టు గురించి వివరించారు. సమావేశంలో ఏఎఫ్ ఎకాలజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీక్రిష్ణ, స్టేట్ లీడ్ భక్తర్ వలీ, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు, డ్వామా పీడీ సలీంబాషా, పశుశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, నాబార్డు డీడీఎం అనురాధ, గ్రౌండ్ వాటర్ డీడీ కె.తిప్పేస్వామి పాల్గొన్నారు.
రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
అనంతపురం కల్చరల్: వినియోగదారులకు రక్షణగా ఉన్న చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ తెలిపారు. నగరంలోని రెవెన్యూ భవన్‌లో మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వస్తు సేవల్లో నాణ్యత లోపిస్తే చట్ట ప్రకారం ఆయా కంపెనీల యజమానులను బాధ్యులను చేయవచ్చన్నారు. వస్తువుకు సంబంధించి రశీదు తప్పనిసరిగా పొందాలని సూచించారు. అంతకు ముందు వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు శ్రీలత, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ సుధాకర్, డీఈఓ ప్రసాదబాబు, డీవీఈఓ వెంకటరమణ నాయక్, పలు సంఘాల ప్రతినిధులు నబీరసూల్, చల్లా కిషోర్, వన్నూరప్ప, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఎఫ్ ఎకాలజీ ప్రాజెక్టులో
రైతులు భాగస్వాములు కావాలి
ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ
Comments
Please login to add a commentAdd a comment