కరువు పరిశీలనకు కేంద్ర బృందం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితుల పరిశీలనకు జనవరి మొదటి వారంలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) రానున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల జాబితా ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నా కేవలం అనంతపురం జిల్లాలో ఏడు, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 మండలాలనే జాబితాలో చేర్చడంతో మిగిలిన 46 మండలాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని ఏడు మండలాల్లో పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు రూ.19 కోట్లతో నివేదిక సిద్ధం చేశారు. కేంద్ర బృందం పర్యటనలో క్షేత్ర స్థాయిలో జరిగిన పంటనష్టం పరిశీలన తర్వాత నివేదిక సమర్పించనున్నారు. ఆ తర్వాత పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) రూపంలో ఒక్కో రైతుకు గరిష్టంగా రెండు హెక్టార్లకు పరిహారం మంజూరు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
రబీ ‘ఇన్‌పుట్’పై నోరుమెదపరే...?
గత రబీకి సంబంధించి ప్రభుత్వం 17 మండలాలతో కరువు జాబితా ప్రకటించగా.. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో కేంద్ర బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి వెళ్లింది. ప్రధానపంట పప్పుశనగతో పాటు మరికొన్ని పంటలు దెబ్బతినడంతో 17 మండలాల పరిధిలోని రైతులకు రూ.37 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని నివేదిక అందించారు. కానీ ఆరు నెలలు కావస్తున్నా ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. దీనిపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకున్నా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి మొదటి వారంలో పర్యటన
Comments
Please login to add a commentAdd a comment