ఉగ్గాని, బజ్జీ తిని 10 మందికి అస్వస్థత
ఉరవకొండ: స్థానిక భవాని ఆలయంలో భక్తుల ఇరుముడి కార్యక్రమంలో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉగ్గాని, బజ్జీలు తిని ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురై 10 మంది ఆసుపత్రిలో చేరారు. వివరాలు.. భవాని ఆలయంలో మంగళవారం అమ్మవారి మాలధారుల ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఉరవకొండ పట్టణంలోని ఎస్సీ కాలనీ, సత్యనారాయణపేటకు చెందిన కోమేశ్వరీ, మమత, గోవిందమ్మ, జ్యోతి, అంజినమ్మ, రమేష్, మధు, గోవిందు, పావని, శరత్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద కొంతమంది భక్తులు తీసుకొచ్చిన ఉగ్గాని, బజ్జీని తిన్నారు. ఇంటికి వచ్చిన తరువాత వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే కుటుంబీకులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్సలు అందించారు.
తత్కాల్ కింద ‘పది’ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశంగా తత్కాల్ కింద వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 1000 అపరాధ రుసుంతో ఈనెల 27 నుంచి 2025 జనవరి 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ కోరారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు చొరవ చూపాలని ఆదేశించారు.
రెండు మట్టి టిప్పర్ల పట్టివేత
యాడికి: మండలంలోని రాయలచెరువు గ్రామ చెరువు నుంచి పర్మిట్లు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను మంగళవారం అధికారులు పట్టుకున్నారు. గ్రామ సమీపంలో స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ‘చెరువులో మట్టి రాబందులు’ శీర్షికిన ‘సాక్షి’లో వచ్చిన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు యాడికి మండల ఇరిగేషన్ జేఈ నూర్జహాన్ రెండు టిప్పర్లను పట్టుకుని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా జేఈ మాట్లాడుతూ చెరువు మట్టిని అక్రమంగాతరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ వీఆర్‌ఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నెట్టికంటుడి సేవలో
జిల్లా జడ్జి
గుంతకల్లు రూరల్: జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జడ్జి శ్రీనివాస్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి జడ్జి కుటుంబ సభ్యుల పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment