కరుడు గట్టిన నేరస్తుల ఆట కట్టించారు. నేరగాళ్ల గుండెల్లో
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా పోలీసుల ప్రతిష్ట మసకబారిందా? మితిమీరిన రాజకీయ జోక్యంలో నలిగిపోతున్నారా? బాధితుల పక్షాన నిలబడాల్సిన వాళ్లు నిందితుల వైపు మొగ్గు చూపుతున్నారా?...ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలే వస్తున్నాయి. గతంలో ఎన్నో క్లిష్టమైన కేసులకు అలవోకగా పరిష్కారం చూపిన జిల్లా పోలీసులు.. నేడు ఓ మోస్తరు తీవ్రమైన కేసులను కూడా ఎందుకు ఛేదించలేకపోతున్నారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో తమ పనితీరుతో రాష్ట్ర స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జిల్లా ఖాకీలు.. ఇప్పుడెందుకు కేవలం కాపర్‌వైర్‌ల దొంగలకు మాత్రమే పరిమితమయ్యారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
అథమ స్థాయికి..
గడిచిన ఐదేళ్లలో అంటే 2019–24 మధ్య జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. అంతర్జాతీయ నేరగాళ్ల ద్వారా చలామణీ అవుతున్న హవాలా సొమ్మును పట్టుకుని ముఠా ఆట కట్టించారు. అంతర్రాష్ట్ర దొంగలను చాకచక్యంగా పట్టుకుని ఒకేసారి 50 బైకులను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపారు. గతంలో కర్ణాటక మద్యం జిల్లాలోకి తేవాలంటే అక్రమార్కులు భయపడేవారు. అలాంటి పోలీసులు కూటమి సర్కారు వచ్చాక పూర్తిగా మారిపోయారు. ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్‌లు దొంగలించే వారిని, చైన్‌స్నాచర్లను పట్టుకుని ప్రెస్‌మీట్ పెట్టి గొప్పలు చెప్పుకునే స్థాయికి దిగజారారు. సైలెన్సర్ లేని బైకుల పొగ గొట్టాలను ఊడదీసి రోడ్డురోలర్ కింద తొక్కిస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు.
వైఫల్యాల్లో మచ్చుకు కొన్ని..
● తాడిపత్రిలో సీఐ లక్ష్మీకాంత రెడ్డి చట్టబద్ధంగా వ్యవహరించినా ఉన్నతాధికారులు ఆయనదే తప్పన్నట్లు ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
● రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రాముల వారి రథానికి నిప్పుపెట్టిన కేసును ఇప్పటికీ తేల్చలేదు. దుండగులను పట్టుకోనే లేదు. రాజకీయ జోక్యంతో కేసు నీరుగార్చారనే విమర్శలున్నాయి.
● ఇటీవల రాప్తాడు సమీపంలో రూ.66 లక్షల విలువ చేసే గోవా మద్యం పట్టుబడితే ఇప్పటివరకూ అసలు నిందితుణ్ని పట్టుకోలేకపోయారు.
● తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని శాంతిభద్రతల నెపంతో 7 నెలలుగా తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదు. ఇంతకంటే ఘోర వైఫల్యం మరోటి లేదనే విమర్శలున్నాయి.
● తాడిపత్రికి చెందిన బోయ రవికుమార్ అనే వ్యక్తి షాపునకు కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు తాళాలు వేశారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సీఐ సాయిప్రసాద్ తీసుకోకపోగా.. బాధితుడినే మందలించి పంపించారు.
● జిల్లాలో మట్కా, పేకాట, గంజాయి వ్యవస్థీకృత నేరాలుగా మారాయి. కట్టడి చేయడంలో పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. .
● బహిరంగ మద్యపానం, బెల్టుషాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్నా కన్నెత్తి చూడటం లేదు. దీంతో ఎన్నో కుటుంబాలకు చెందిన మహిళలు పోలీసులను దుమ్మెత్తి పోస్తున్నారు.
రాజకీయ ‘క్రీనీడ’లో ఖాకీ
చిల్లర దొంగతనాల నిందితులను పట్టుకోవడానికే పరిమితం
కాపర్‌వైర్‌ల దొంగలు, చైన్‌స్నాచర్‌లను పట్టుకుని ప్రెస్‌మీట్‌లు
గోవా మద్యం భారీ డంప్ కేసులో
కానరాని ప్రధాన నిందితుడి జాడ
‘రాయదుర్గం’లో రాములోరి రథం కాల్చిన కేసులోనూ పురోగతి అంతే
మితిమీరిన రాజకీయ జోక్యంతో అప్రతిష్ట
Comments
Please login to add a commentAdd a comment