బడ్జెట్ మిగుల్చుకునేందుకే సంక్షేమ పథకాల్లో కోత
అనంతపురం అర్బన్:‘‘ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. సరికదా బడ్జెట్ మిగుల్చుకునేందుకు సంక్షేమ పథకాల్లో కోతకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో అనర్హుల గుర్తింపు పేరుతో సర్వే చేపడుతోంది.పేదలకు అన్యాయం చేస్తే సహించబోము. వారి తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తాము’’ అని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. సీపీఎం 14వ జిల్లా మహాసభల్లో భాగంగా రెండవ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం అనంతపురం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకాలు అందుకుంటున్న వారిలో అనర్హుల గుర్తింపు పేరుతో ప్రభుత్వం చేపట్టిన సర్వే సరైంది కాదన్నారు. పార్టీలపరంగా తొలగింపులు చేసి.. రాజకీయ వేధింపులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. సర్వే పేరుతో కుటుంబ సమాచారాన్ని మొత్తం సేకరించి బయటి కంపెనీలకు అమ్ముకునే ప్రమాదమూ ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తాము డేటా ప్రైవసీ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని దొడ్డిదారిన ప్రైవేటుపరం చేయాలని చూస్తోందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 30న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు.
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడూ లేనివిధంగా ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.16 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజలపై మోపుతున్న భారాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలోలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment