క్రీస్తు జననం శాంతికి సంకేతం
● జిల్లా ప్రజలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత క్రిస్మస్ శుభాకాంక్షలు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్టియన్ మైనార్టీ సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని, తన జీవితం, మరణం ద్వారా లోకానికి సరైన మార్గాన్ని ఏసు ప్రభువు చూపారని తెలిపారు. ప్రేమ, కరుణకు ప్రతీక ఏసు ప్రభువని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సంస్థలు సేవాతత్పరతతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడితేనే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని తెలిపారు. సమాజంలో చెడును పక్కన పెట్టి మంచిని పెంపొందించాలని సూచించారు. ఏసుక్రీస్తు బోధనలు సన్మార్గంలో నడిచేలా చేస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళికి శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త ఏసు ప్రభువు అని అన్నారు. తన పేరుతో ఒక శకానికి నాంది పలికిన క్రీస్తు చరిత్ర పవిత్రం, ఆయన జన్మదినం సర్వ మానవాళికి పవిత్ర దినం అని పేర్కొన్నారు.
● అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ వసీం కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరిపై ఏసు దయ ఉండాలని ఆకాంక్షించారు.
ఏసుమార్గం అనుసరణీయం
● ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసు క్రీస్తు చూపిన ప్రేమ మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. ఆయన కృపతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని ఆకాక్షించారు. క్రైస్తవులు పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment