హామీ మేరకు పెట్టుబడి సాయం చెల్లించాలి
● ఏపీ రైతుసంఘం డిమాండ్
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడారు. హామీ ప్రకారం రైతులకు అటు ఖరీఫ్‌లోనూ, ఇటు రబీలోనూ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వన్నారెడ్డి, నరసింహులు, మహిళ నాయకురాలు లలితమ్మ, వెంకట్రాముడు యాదవ్, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.
గంజాయి రహిత జిల్లాగా మారుస్తాం : ఎస్పీ
తాడిపత్రిటౌన్: గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే సంకల్పంతో పని చేస్తున్నట్లు ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. అలాగే పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సైతం డ్రోన్‌లతో జల్లెడ పడుతున్నామన్నారు. పాత నేరస్తుల ఇళ్లు, దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గంజాయి మూలాలను కనిపెట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు జాగిలాల సహాయంతో రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పార్శిల్ సర్వీస్, ట్రాన్‌పోర్ట్ కార్యాలయాలు, కార్గో సర్వీసులు, గోడౌన్, లాడ్జీలలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పట్టణంలో అల్లర్లు, గొడవలకు తావు లేకుండా చూస్తామన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు వ్యవహరించాలన్నారు. మట్కా, పేకాట తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామక్రిష్ణుడు, సీఐలు శివగంగాధర్‌రెడ్డి, రామసుబ్బయ్య, సీఐ ఈరన్న, ఎస్‌ఐ గౌస్‌బాషా సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచండి
పెద్దపప్పూరు/పెద్దవడుగూరు: సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలని ఎస్పీ జగదీష్ పోలీసుల సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల పోలీస్‌స్టేషన్‌లను అకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు ఆయా మండలాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు చోటివ్వరాదని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐలు నాగేంద్రప్రసాద్, ఆంజనేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment