కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్
వజ్రకరూరు: కందుల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది అత్యధికంగా కంది పంట సాగులోకి వచ్చిందన్నారు. పంట దిగుబడులు చేతికి అందిన తర్వాత కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తక్కువ ధరకే దళారులకు రైతులు విక్రయిస్తున్నారన్నారు. రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పేరుతో కాలయాపన చేయడం సబబు కాదన్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటా కంది రూ.8,500తో అమ్ముడు పోతోందన్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలోనూ క్వింటా రూ.8,200 నుంచి రూ. 9 వేలు చొప్పున ధర పలుకుతోందన్నారు. కందులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు న్యాయం చేకూరేలా మద్దతు ధరను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రమణా యాదవ్, రైతు విభాగం నాయకుడు కాకర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్
విద్యార్థిని అదృశ్యం
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట శివారులోని పీవీకేకే కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థిని కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు...శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలానికి చెందిన ఓ విద్యార్థిని ఎస్కేయూ సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం పీవీకేకే కళాశాలలో తనకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి తల్లి, సోదరుడితో కలిసి వెళ్లింది. అనంతరం తల్లి, సోదరుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. పరీక్ష ముగిసే సమయానికి అక్కడికి చేరుకున్నారు. తక్కిన విద్యార్థులందరూ బయటకు వెళ్లిపోయినా కూతురు రాకపోవడంతో లోపలకు వెళ్లి ఆరా తీశారు. విద్యార్థులందరూ బయటకు వెళ్లిపోయారని యాజమాన్యం తెలపడంతో అనుమానం వచ్చిన తల్లి వెంటనే అనంతపురం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కళాశాల గేట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో పరీక్ష ముగిసేందుకు గంట ముందే సదరు విద్యార్థిని బయటకు వచ్చి ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. ఆటో డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారించగా...ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రాప్ చేసినట్లు తెలిపాడు. ఆటో దిగిన విద్యార్థిని తర్వాత ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment