ప్రజలకు ‘కూటమి’ కరెంటు షాక్
అనంతపురం కార్పొరేషన్: విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు కరెంటు షాక్ ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 27న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పోరుబాటకు మద్దతుగా భారీగా తరలిరావాలని ప్రజలకు ఆ పార్టీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రమేష్‌గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కరెంటు చార్జీలు పెంచబోమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టిన కేవలం ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ భారం మోపారని మండిపడ్డారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శుక్రవారం ఉదయం పది గంటలకు అనంతపురంలోని పాతూరు బ్రహ్మంగారి ఆలయం నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరారు.
నాడు హేళన చేసి...
తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెడతామని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీనిస్తే... అప్పటి సీఎం చంద్రబాబు హేళన చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. అయితే అధికారం చేపట్టిన మరుక్షణమే ఉచిత విద్యుత్ పథకంపై వైఎస్సార్ సంతకం చేశారన్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చడంలో వైఎస్సార్ కుటుంబానికి సాటి మర్వెవరూ లేరని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించారన్నారు. తన పాలనలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలపై పన్నుల భారం పడకుండా నాణ్యమైన విద్యుత్‌ను గత సీఎం వైఎస్ జగన్ అందజేశారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దళిత వాడల్లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒకప్పుడు కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విద్యుత్ అధికారులు ఇస్తున్న కరెంటు బిల్లును పట్టుకుంటే ప్రజలు షాక్‌కు గురవుతున్నారన్నారు. ధనవంతులతో సమానంగా పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలుండాలని భావించి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అప్పటి సీఎం వైఎస్ జగన్ నెరవేర్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచారన్నారు. ప్రస్తుతం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రమోహన్, రామ్మోహన్ గౌడ్, బెస్త వెంకటేశులు, తాడిమూరు నరేంద్ర, హేమకిరణ్, అంకె తేజ, లబ్బే రాఘవ, హిదయతుల్లా, రమేష్, చండ్రాయుడు, భాస్కర్, వినీత్, వంశీ, పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.15,485 కోట్ల భారం
27న వైఎస్సార్‌సీపీ పోరుబాటను జయప్రదం చేయండి
వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రమేష్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment