● ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ జనాభా వివరాలపై సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే జిల్లాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు ఈ నెల 31వ తేదీలోగా సచివాలయాల్లో సమర్పించాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను జనవరి ఆరో తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 10వ తేదీన కులగణన తుది వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు.
మూడు దశల్లో తనిఖీ
సామాజిక తనిఖీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. అభ్యంతరాలను మూడు దశల్లో తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాలను తొలుత వీఆర్‌ఓ పరిశీలించి ఆర్‌ఐకు నివేదిక ఇస్తారన్నారు. దానిని ఆర్‌ఐ పునఃశీలించి తహసీల్దారుకు నివేదిస్తారని తెలిపారు. ముగ్గురి నివేదికలను పరిశీలించి తుది ఆమోదం తరువాత పోర్టల్‌లో పొందుపరుస్తారని తెలియజేశారు.
వివరాలపై ర్యాండమ్ తనిఖీ
పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల్లో కచ్చితత్వం కోసం ర్యాండమ్ తనిఖీ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాలను ర్యాండమ్‌గా తనిఖీ చేస్తామని వెల్లడించారు. ఎస్సీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment