‘నూతన’ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి
అనంతపురం: ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఓ ప్రకటనలో సూచించారు. రహదారులు, పబ్లిక్ స్థలాల్లో వేడుకలు అనుమతించేది లేదన్నారు. టపాసులు కాల్చడంపై నిషేధం విధించామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదన్నారు. విచక్షణారహితంగా వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని హితవు పలికారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు నిర్ణీత సమయంలోపు మూసివేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతపురంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. రోడ్లపై యువత మద్యం సేవిస్తూ, బైకులపై ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది పెడితే ఉపేక్షించమన్నారు. మహిళలు, బాలికలపై కామెంట్, టీజింగ్‌కు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువ శబ్దాలు వచ్చే డీజే సౌండ్ సిస్టం వంటివి ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని, బైకులకు సైలెన్సర్‌లు తీసేసి, విన్యాసాలు చేస్తూ అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లా అంతటా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, డీఎస్పీల అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని సూచించారు.
ఎస్పీ పి. జగదీష్
Comments
Please login to add a commentAdd a comment