పాఠశాలకు టీచర్లు రావడంలేదు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలకు టీచర్లు రావడంలేదు

Published Fri, Jan 3 2025 2:14 AM | Last Updated on Fri, Jan 3 2025 2:14 AM

-

అనంతపురం అర్బన్‌:‘‘ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు. పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది’’ అంటూ కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌కు ఓ వ్యక్తి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం స్థానిక ఆకాశవాణి కేంద్రం నుంచి ‘అనంత మిత్ర ఫోన్‌ఇన్‌’ కార్యక్రమాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

‘అనంతపురం రామచంద్రానగర్‌లోని ఛత్రపతి శివాజీ నగర పాలక పాఠశాలలో నా కుమార్తె ఒకటో తరగతి చదువుతోంది. మూడు నెలల నుంచి గమనిస్తున్నా. స్కూల్‌కు ఉపాధ్యాయులు సక్రమంగా రావడంలేదు. ఒక్కో రోజు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే హాజరవుతారు. సమస్యను డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా మార్పు రాలేదు’ అని చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ... పాఠశాలను తనిఖీ చేసి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించాలని నగర పాలక కమిషనర్‌ను ఆదేశించారు.

లలితా నగర్‌కు చెందిన శారద మాట్లాడుతూ తమ ప్రాంతంలో రోడ్డు, తాగునీరు, వీధి దీపాలు, కాలువ తదితర సదుపాయాలు లేవని, బళ్లారి బైపాస్‌ నుంచి టవర్‌క్లాక్‌ వరకు ప్లైఓవర్‌ బ్రిడ్జిపై పారిశుధ్యం లోపించిందని, జాతీయ రహదారిలో లైట్లు లేవని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ మాట్లా డుతూ జాతీయ రహదారిపై లైట్లను వారంలోగా ఏర్పాటు చేస్తామన్నారు. మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

తమ పంచాయతీలో కాలువ, రోడ్డు సమస్యలు ఉన్నాయని యాడికికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అనంతపురం నగర పరిధిలో ‘సులభ్‌ కాంప్లెక్స్‌’ల నిర్వహణ సరిగా లేదని, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని అనంతపురానికి చెందిన నరసింహారెడ్డి చెప్పగా.. తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కార్యక్రమంలో మునిసిపల్‌ ఆర్‌డీ విశ్వనాథ్‌, నగర పాలక కమిషనర్‌ రామలింగేశ్వర్‌, ఆకాశవాణి డైరెక్టర్‌ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘ఫోన్‌ఇన్‌’లో కలెక్టర్‌కు

ఓ వ్యక్తి ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement