8న కేంద్ర బృందం పర్యటన
అనంతపురం అగ్రికల్చర్: గత ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితుల పరిశీలనకు ఈనెల 8న అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంఎస్‌టీ) పర్యటించనున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు రూరల్ మండలం మన్నీల, రాప్తాడు మండలంలో ఫొటో ఎగ్జిబిషన్, పంట పొలాల పరిశీలన, రైతులతో ముఖాముఖి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అనంతపురం, నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, రాప్తాడు, యాడికి, విడపనకల్లు మండలాలను ప్రకటించింది. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే పంట నష్టం అంచనాలు పూర్తి చేశారు. ఒక్కో రైతుకు గరిష్టంగా రెండు హెక్టార్లకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) అందించాలని కేంద్ర బృందానికి నివేదికలు అందించనున్నారు. కేవలం 17 మండలాలకు అంతో ఇంతో ప్రయోజనం చేకూరనుండగా, మిగతా 46 మండలాలకు అన్యాయం జరిగేలా కరువు జాబితా ప్రకటించడంపై రైతులు మండిపడుతున్నారు. గత రబీలో ప్రకటించిన కరువు మండలాలకు నిబంధనల మేరకు అందాల్సిన రూ.37 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్ ఆత్మహత్య
అనంతపురం: కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ద్వారకానగర్‌లో జరిగింది. అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కే. సాయినాథ్ తెలిపిన మేరకు.. ద్వారకానగర్‌కు చెందిన బి. జనార్దన రెడ్డి (50), ప్రసన్నలక్ష్మి దంపతులు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కాంట్రాక్టర్ అయిన జనార్దన రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం, ధర్మవరం, నంద్యాల జిల్లా గుమ్మడాపురం, అన్నమయ్య జిల్లా ఊటుకూరులో పలు పనులు చేశారు. ఇందుకోసం రూ.4.50 కోట్లు బయట అప్పు చేశారు. అయితే, పనులకు బిల్లులు కాకపోవడంతో కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే క్రమంలో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వడ్డీ కట్టలేకపోతున్నానని, అప్పిచ్చిన వారికి తన మొహం ఎలా చూపించాలంటూ కుటుంబసభ్యులతో బాధపడుతుండేవారు. జనార్ధన రెడ్డికి అనంతపురం ఆర్‌ఎఫ్ రోడ్డులో ఉన్న కర్ణాటక బ్యాంకులో ఓడీ అకౌంట్ ఉంది. శుక్రవారం బ్యాంకుకు వెళ్లగా అప్పులకు గ్యారెంటీ రెన్యూవల్ విషయంలో మేనేజర్ దురుసుగా మాట్లాడారు. ఈ క్రమంలోనే జనార్దన రెడ్డి మనస్తాపం చెంది విషపు గుళికలు మింగారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం సవేరా ఆసుపత్రిలో చేర్పించగా శనివారం మృతి చెందారు. బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో బ్యాంకు మేనేజర్ దురుసుగా మాట్లాడటంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని మృతుడి భార్య ప్రసన్నలక్ష్మి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment