రుణ లక్ష్యాలు పూర్తి చేయండి
● అఽధికారులకు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
అనంతపురం అర్బన్: స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 1,728 యూనిట్లు కేటాయించారన్నారు. రూ.2 లక్షల యూనిట్ విలువ ఉన్నవి 1,228 యూనిట్లు, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల యూనిట్ విలువ కలిగినవి 368 యూనిట్లు, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల యూనిట్ విలువ ఉన్నవి 132 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. కేటాయించిన లక్ష్యాలను ఆయా బ్యాంకులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మీ–సేవ, సచివాలయాల్లో అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఈబీసీ యువతకు జనరిక్ మెడికల్‌షాపు
ఈబీసీ నిరుద్యోగ యువతకు జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాకు 72 జనరిక్ మెడికల్ షాపులు మంజూరయ్యాయని, యూనిట్ విలువ రూ.8 లక్షలు ఉంటుందని, సబ్సిడీ రూ.4 లక్షలు, బ్యాంకు రుణం రూ.4 లక్షలు ఇస్తామన్నారు. ఎల్‌డీఎం నర్సింగరావు,బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రమణ్యం, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, మత్స్య శాఖ అధికారి శ్రీనివాసనాయక్, తదితరులున్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
శింగనమల: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శనివారం నార్పలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని’ ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 11,244 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. హాజరు శాతం పెంచాలని అధ్యాపకులను ఆదేశించారు. కార్యక్రమంలో డీవైఈఓ వెంకటరమణ నాయక్, డీఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, సర్పంచ్ సుప్రియ, తహసీల్దార్ ఆరుణకుమారి, ఎంఈఓ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ బాలప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment