పామిడి: సాంకేతిక సమస్యల వల్ల ఇన్‌యాక్టివ్ అయిన జాబ్‌కార్డులను యాక్టివ్‌గా మార్చే ప్రక్రియను అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ‘తమ్ముళ్లు’ తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రూ.500 చెల్లిస్తే యాక్టివ్ చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా పామిడి గ్రామపంచాయతీలో వెలుగు చూసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద కూలీలు వలస వెళ్లకుండా ఏడాదిలో వంద రోజులు పని కల్పిస్తారు. ఉన్న ఊరిలోనే పనులు చేసే అవకాశం ఉంటుంది. గ్రామపంచాయతీగా ఉన్న పామిడి 2012లో డీ–గ్రేడ్ మున్సిపాలిటీ (నగర పంచాయతీ)గా రూపాంతరం చెందింది. దీంతో పామిడితో పాటు పి.కొత్తపల్లి, పి.కొండాపురం గ్రామాల్లో అప్పటి వరకు జరుగుతున్న ఉపాధి హామీ పనులకు బ్రేక్ పడింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు 2019 తర్వాత పామిడి తిరిగి గ్రామపంచాయతీగా డిమోట్ అయ్యింది. అప్పటి నుంచి ఉపాధి హామీ పనుల కల్పనను పునరుద్ధరించారు. అయితే పంచాయతీ పరిధిలోని 2,500 ఉపాధి హామీ జాబ్‌కార్డులు డీయాక్టివేట్‌లో ఉండిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంకేముంది అధికార ‘తెలుగు తమ్మళ్లు’ జాబ్‌కార్డుల యాక్టివేషన్‌ను తమకు అనుకూలంగా చేసుకున్నారు. తాము సిఫార్సు చేస్తేనే కార్డు యాక్టివేషన్ చేస్తారని చెప్పి ఒక్కొక్క కూలీ నుంచి రూ.500 రేటు ఫిక్స్ చేసి దందాకు తెరలేపారు. కూలి పనులపై ఆధారపడిన కూలీలు జాబ్‌కార్డులను యాక్టివేట్ చేసుకునేందుకు టీడీపీ వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోంది. కష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునే తమలాంటి వారి నుంచి డబ్బు వసూలు చేయడం దారుణమని పేర్కొంటున్నారు.
జాబ్‌కార్డుల యాక్టివ్ పేరిట కూలీల నుంచి డబ్బు వసూలు
Comments
Please login to add a commentAdd a comment