అనంతపురం అర్బన్: ‘‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తీవ్ర నేరం. లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలవ్వాలి. స్కానింగ్ సెంటర్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. చట్టాన్ని ఉల్లంఘించే వాటిపై కేసులు నమోదు చేయండి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అదనపు జిల్లా జడ్జి శోభారాణితో కలిసి జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ చట్టంపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ సెంటర్లు చట్ట పరిధిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికల ప్రాముఖ్యత తెలిసేలా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా హాళ్లు, తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు జిల్లా జడ్జి శోభారాణి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలతో కలిసి మారుమూల గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, సీ్త్రవ్యాధి నిపుణులు శంషాద్‌బేగం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment