10,18న జాబ్‌మేళా
అనంతపురం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో నిర్వహించనున్న జాబ్‌మేళాల షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్ వినోద్‌కుమార్ శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 10న రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, 18న ఆర్ట్స్ కళాశాల (రాప్తాడు నియోజకవర్గం వారికి), కళ్యాణదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తారు. యువత 83175 20929, 08554–281026 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. naipunyam.ap. gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పింఛన్ల ఏరివేతకు చర్యలు
అనంతపురం అర్బన్: అనర్హ పింఛన్ల ఏరివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ప్రతి నెలా 2,499 మంది అనారోగ్య పింఛన్లు తీసుకుంటున్నారన్నారు. అంగవైకల్యం, వివిధ రకాల వ్యాధులకు గురై పింఛను పొందుతున్న వారి అర్హతపై మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జిల్లాస్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో వైద్య బృందం ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలిస్తుందన్నారు. అధికారులు నిర్దేశించిన తేదీల్లో ఇంటి వద్దనే ఉండి ఆరోగ్య బృందానికి సహకరించాలని, లేని పక్షంలో పింఛను నిలిపివేస్తారని హెచ్చరించారు. సమాచారం కోసం సంబంధిత ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్‌ను సంప్రదించాలని సూచించారు.
చీటీల పేరుతో కుచ్చుటోపీ
● రూ. 2 కోట్లతో ఉడాయించిన మహిళ
గుత్తి: చీటీల పేరుతో కుచ్చుటోపీ పెట్టిన ఉదంతమిది. మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ఎస్ పల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఎస్‌ఎస్ పల్లికి చెందిన అంజలి చాలా రోజులుగా చీటీలు వేస్తోంది. ఎర్రిస్వామి, శేషు, వెంకట సుబ్బయ్య, సూరి, కంబగిరి, ప్రభావతి, రామలక్ష్మమ్మ, మాణిక్యమ్మ, అంకాలమ్మతో పాటు సుమారు 100 మంది ఈమెతో చీటీలు కట్టారు. దీంతో పాటు కొంత నగదును వడ్డీకి ఇచ్చారు. ఈ క్రమంలోనే సుమారు రూ. 2 కోట్ల చీటీ డబ్బుతో అంజలి ఉడాయించింది. శనివారం రాత్రి అంజలి ఇంట్లోని సామాన్లను ఆమె తల్లి తీసుకెళుతుండగా బాధితులు అడ్డుకున్నారు. నెల క్రితమే అంజలి ఎక్కడికో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment