8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 8న నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) ఆర్. రామచంద్రారెడ్డి గురువారం తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సహా ఆయా స్థాయీ సంఘాల అధ్యక్షుల అధ్యక్షతన స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7(ఆర్థిక/ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి/ వ్యవసాయం/ విద్య, వైద్యం/మహిళా శిశు, సంక్షేమం/సాంఘిక సంక్షేమం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గత సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలు, ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో సభ్యులు అడిగే సమస్యలకు సంబంధించి సమగ్ర సమాచారంతో అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. ఎవరైనా గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అనంతపురం మెడికల్: కడప జోన్ పరిధిలోని 150 స్టాఫ్‌నర్సు ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కడప ప్రాంతీయ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ. భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. https:cfw.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్ల
ఉచ్చులో వంట మాస్టర్
గుత్తి: పట్టణానికి చెందిన వంట మాస్టర్ మహా లక్ష్మయ్య సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 70 వేలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. మహా లక్ష్మయ్యకు గత నెల 27న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తమ వద్ద పాత ఐదు రూపాయల నోట్లు ఉన్నాయని, వాటిని తాము చెప్పిన చోట అమ్ముకుంటే భారీగా డబ్బులొస్తాయని ఆశ చూపాడు. తమ వద్ద ఉన్న ఆ నోట్లు పంపాలంటే ముందుగా డబ్బు పంపాలని సూచించాడు. దీంతో ఆశపడ్డ మహాలక్ష్మయ్య వెనుకా ముందూ ఆలోచించకుండా వారు చెప్పిన నంబర్‌కు రెండు సార్లు కలిపి మొత్తం రూ. 70 వేలు పంపాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. లబోదిబోమంటూ గురువారం పోలీసుల ఆశ్రయించాడు.
రోడ్డు పనులు
నాణ్యతగా చేపట్టాలి
అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు పనులు నాణ్యతగా చేప ట్టాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా పేర్కొన్నారు. గురువారం ఉపాధి హామీ పథకం ఏపీడీలు, ఏపీలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్ల నిధులతో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల పనులు చేపడుతున్నారన్నారు. పనుల నాణ్యతను నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఎక్కడా నాణ్యత లోపం లేకుండా పనులు జరిగే విధంగా కాంట్రాక్టర్లకు ఆదేశా లివ్వాలన్నారు. మార్చి లోపు పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో వ్యక్తిగత ఇంకుడు గుంతలు తవ్వుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రతి మండలానికి 1,000 చొప్పున జిల్లా వ్యాప్తంగా 31 వేల ఇంకుడు గుంతలు మంజూరైనట్లు తెలిపారు. వేగవంతంగా లబ్ధిదారుల ఎంపిక పక్రియను చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment