యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి
అనంతపురం: యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. న్యాయ అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం ఆయన జిల్లా కోర్టులో ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను బుగ్గిపాలు చేసుకోరాదన్నారు. ఇటీవలి కాలంలో అత్యాచార ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అత్యాచార ఘటనలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిస్తే సమీపంలోని కోర్టులో గానీ పోలీస్‌స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా న్యాయ సేవాసదన్‌లో సమాచారం అందజేస్తే వివరాలను గోప్యంగా ఉంచుతారని చెప్పారు. అనంతపురంలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదును జిల్లా న్యాయసేవాసదన్‌లో ఇవ్వగా, న్యాయమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేసి చర్యలు తీసుకున్నారని తెలిపారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్, లా కళాశాల అధ్యాపకులు ఆర్. కల్పన, డాక్టర్ రమ్య, న్యాయవాది ఎన్. హరికృష్ణ పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
అనంతపురం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీగా ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి వరకూ ఈడీగా పని చేసిన సారయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇన్‌చార్జ్ బాధ్యతలను ప్రతాప్ సూర్యనారాయణరెడ్డికి అప్పగించింది. ఈ క్రమంలోనే ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు.
ఎస్కేయూలో జడలు విప్పిన ర్యాగింగ్ భూతం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పింది. కొన్ని రోజులుగా క్యాంపస్ ఎంబీఏ విభాగంలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. చిత్రావతి హాస్టల్‌లో ఎంబీఏ సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జూనియర్ విద్యార్థులందరినీ గ్రూపుగా నిలబెట్టి ర్యాగింగ్ చేశారు. బిగ్గరగా అరుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. తాము చెప్పే వరకు నిలబడే ఉండాలంటూ వేధించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు రూములోకి వెళ్లనివ్వలేదు. ర్యాగింగ్ చేసినట్లు బయటకు చెబితే అంతుచూస్తా మంటూ బెదిరించినట్లు తెలిసింది. ఇప్పటికై నా వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి ఎంబీఏ జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ భూతం నుంచి కాపాడాల్సి ఉంది.
హత్య కేసులో ఐదేళ్ల
కఠిన కారాగార శిక్ష
అనంతపురం: హత్య కేసులో ముద్దాయికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. అలాగే, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ సోమవారం తీర్పు వెలువరించారు.వివరాలు.. బుక్కరాయసముద్రం మండలం అనంతసాగర్ కాలనీకి చెందిన వినోద్‌కుమార్‌ను 2022 ఏప్రిల్ 14న అదే కాలనీకి చెందిన మరూరు రత్నమయ్య కత్తితో ఛాతిపై పొడిచి హత్య చేశాడు. గతంలో వైన్‌షాపుల వద్ద జరిగిన గొడవలను మనుసులో పెట్టుకుని వినోద్‌కుమార్‌ను చంపితే.. అతని సామాజికవర్గంలో తానంటే భయం ఉంటుందనే కారణంతో దారుణంగా చంపాడు. ఈ హత్యా ఘటనపై బుక్కరాయసముద్రం పోలీసులు 2022 ఏప్రిల్ 15న కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ డి. రాము దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున 8 మంది సాక్షులను విచారించగా, రత్నమయ్యపై నేరం రుజువైంది. దీంతో ముద్దాయికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ సోమవారం సంచనల తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున రాచమల్లు హరినాథ రెడ్డి వాదనలు వినిపించారు. కేసులో బలమైన సాక్ష్యాలు సేకరించి ముద్దాయికి శిక్ష పడేలా అప్పటి సీఐ డి. రాము కృషి చేశారు. కోర్టు మానిటరింగ్ సిస్టం సీఐ వెంకటేశ్ నాయక్, ఏఎస్‌ఐ మల్లిరెడ్డి, కానిస్టేబుళ్లు బి. రామమోహన్, ఏ. ప్రదీప్ కుమార్, లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు సాక్షులను కోర్టుకు హాజరుపరచడంలో కృషి చేశారు. వీరందరినీ జిల్లా ఎస్పీ పి. జగదీష్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment