జస్టిస్ గుణరంజన్‌కు ఘన స్వాగతం
ఉరవకొండ: ఏపీ హైకోర్టు అదనపు జడ్జి జస్టిస్ గుణరంజన్‌కు ఘన స్వాగతం లభించింది. మండల పరిధిలోని రాకెట్ల గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్నహోబిలం ఆలయ మాజీ చైర్మన్ అశోక్, గ్రామ సర్పంచ్ దెయ్యాల నాగరాజుతో పాటు ప్రజలు జడ్జికి స్వాగతం పలికారు.
జిల్లా హాకీ జట్టు ఎంపిక
అనంతపురం: నగరంలో బుధవారం జిల్లా సబ్ జూనియర్ బాలుర హాకీ జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు హాకీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎస్. అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మదనపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో ఈ జట్టును పాల్గొంటుందన్నారు.
జిల్లా జట్టు క్రీడాకారులు వీరే..
ప్రదీప్, ఆంజనేయులు, జి. వరుణ్, జశ్వంత్, నూర్ మహమ్మద్, అక్షయ్ కుమార్, యు.కార్తీక్, గేయానంద రెడ్డి, ఏ. వరుణ్, నందకిశోర్, గోవర్ధన్, అఖీరా, ఏ. పవన్, కే. ఉదయ్, బాబా ఫరీద్, వెంకటేశ్, పవన్ కుమార్, జునైద్.
స్టాండ్ బై: ఎన్ ఆర్ దీపక్, ధనుష్ కుమార్, మోహిత్.
దాడి చేసిన కానిస్టేబుల్ వీఆర్‌కు..
అనంతపురం: యువకుడిపై అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. నగరంలో మూడు రోజుల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ అహమ్మద్‌పై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ నారాయణస్వామి భౌతికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షిలో ‘ఖాకీల కర్కశం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులు.. మేయర్ వసీం సలీం ఆధ్వర్యంలో అనంతపురం డీఎస్పీని కలిసి దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎస్పీ జగదీష్.. ఘటనపై విచారించాలని అనంతపురం డీఎస్పీ వి. శ్రీనివాసరావును ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్ నారాయణస్వామిని వీఆర్‌కు పంపుతూ ఎస్పీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు.
గంజాయి బ్యాచ్ వీరంగం
తాడిపత్రిటౌన్: గంజాయి బ్యాచ్ మళ్లీ వీరంగం సృష్టించింది. మత్తులో బేల్దారిపై కత్తితో దాడి చేసి గాయపరిచింది. పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన బేల్దారి నాగేంద్ర బుధవారం సాయంత్రం తన ఇంటి సమీపంలోని టీ స్టాల్ వద్ద టీ తాగుతున్నాడు. ఈ క్రమంలోనే గంజాయి సేవించి అక్కడికి చేరుకున్న పట్టణానికి చెందిన యూనస్, యోసెన్, దీపక్ అలియాస్ డూపర్‌లు కత్తితో నాగేంద్రపై దాడి చేసి పరారయ్యారు. గాయపడిన నాగేంద్రను స్థానికులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment