హమ్మయ్య...ఇన్‌చార్జ్ పాలనకు స్వస్తి
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్షలో ఏడు నెలల ఇన్‌చార్జ్ పాలనకు ఎట్టకేలకు స్వస్తి పలికారు. డ్వామా ఏపీడీగా పని చేస్తున్న శైలజను అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు రెండురోజుల క్రితం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో సమగ్రశిక్షకు రెగ్యులర్ అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ)తో పాటు సెక్టోరియల్ అధికారులు లేక పథకాల పర్యవేక్షణ పూర్తిగా కుంటుపడింది. అత్యంత ప్రాధాన్యత కల్గిన విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలు జిల్లాలో అంతంత మాత్రంగానే జరుగుతోంది. 2024 మే 31న ఏపీసీ వరప్రసాదరావు రిటైర్డ్ అయ్యారు. తర్వాత కొద్దిరోజులు ఐఏఎస్ అధికారి నిదియాదేవి ఇన్‌చార్జ్ తీసుకున్నారు. తర్వాత నాగరాజు, ఆ తర్వాత ప్రస్తుత డీఈఓ ప్రసాద్‌బాబు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఎట్టకేలకు రెగ్యులర్ ఏపీసీని నియమించడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శైలజ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
సెక్టోరియల్ ఆఫీసర్ల నియామకాన్ని
పట్టించుకోని ప్రభుత్వం..
విద్యాభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో కీలకంగా ఉండే సెక్టోరియల్ అధికారుల నియామకాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఐదు నెలల కిందట అప్పటి డీఈఓ (సమగ్రశిక్ష డీపీసీ) వరలక్ష్మీ కక్షకట్టి ఉన్నవారందరినీ రీప్యాట్రేషన్ చేశారు. తర్వాత ఆఘమేఘాలపై కొత్తవారి నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత దరఖాస్తులు పరిశీలించి ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయితే నేటికీ భర్తీని పట్టించుకోలేదు. ఎప్పుడూ లేనివిధంగా మితిమీరిన రాజకీయ జోక్యంతో ఉన్నతాధికారులు కూడా గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు అన్ని వసతులు, విద్యాభివృద్ధి కార్యక్రమాలు సమగ్రశిక్ష ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సెక్టోరియల్ ఆఫీసర్ల ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. అధికార పార్టీకి చెందిన ఒక జూనియర్ ప్రజాప్రతినిధి తాను చెప్పిన వారికి సెక్టోరియల్ ఆఫీసర్‌గా అవకాశం ఇవ్వడం లేదనే కారణంగా సంబంధిత అధికారులపై తీవ్రస్థాయిలో బెదిరింపులతో కూడిన ఒత్తిళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు మరో సీనియర్ ప్రజాప్రతినిధి కూడా ఓ మహిళ ఉపాధ్యాయురాలిని సెక్టోరియల్ ఆఫీసర్‌గా తీసుకోవాలని సిఫార్సు చేశారు. తుది జాబితాలో ఆమె పేరు లేదని తెలుసుకున్న ఆయన.. అధికారులపై తీవ్రంగా ఆగ్రహం చేసినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగానే సెక్టోరియల్ ఆఫీసర్ల ఎంపిక మరుగున పడినట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు ‘సమగ్ర శిక్ష’కు
రెగ్యులర్ ఏపీసీ
డ్వామా ఏపీడీ శైలజ
ఏపీసీగా నియామకం
నేడు బాధ్యతల స్వీకరణ
సెక్టోరియల్ ఆఫీసర్ల నియామకాన్ని పట్టించుకోని ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment