నెట్టికంటుడిని దర్శించుకున్న రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనర
గుంతకల్లు రూరల్: రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ పి.హరినాథ్‌గుప్త, తెలంగాణ రాష్ట్ర ఆదిలాబాద్ జిల్లా మాజీ ప్రిన్సిపల్ జడ్జి జి.గోపాలకృష్ణ... గురువారం సాయంత్రం కసాపురం నెట్టికంటి స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పట్టపగలే రెండిళ్లలో చోరీ
పెద్దవడుగూరు: మండల కేంద్రంలో పట్టపగలే దుండగులు రెండిళ్లలో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. వివరాలు.. పెద్దవడుగూరు నుంచి గుత్తికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న గంగిరెడ్డి అలియాస్ ఉత్తమరెడ్డి గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం 1.45 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తాళం పగులగొట్టి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బీరువాలోని మూడున్నర తులాల బంగారు నగలు, 30 తులాల వెండి, రూ.20 వేల నగదు అపహరించినట్లు బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలాగే చిన్నవడుగూరు గ్రామంలో హనుమంతు గురువారం మధ్యాహ్నం తన ఇంటికి తాళం వేసి పెద్దవడుగూరులో హోటల్‌లో భోజనానికి వచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్లే సరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలకు వెళ్లి పరిశీలిస్తే బీరువాలోని రెండున్నర తులాల బంగారు నగలు, రూ.20 వేలు నగదు అపహరించుకెళ్లినట్లు నిర్ధారించుకుని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
శింగనమల: వీధి కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి చెందాయి. శింగనమల మండలం సోదనపల్లిలో గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్రీ సూర్యనారాయణ... జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన గొర్రెల మందకు పెద్దకుంట వద్ద దొడ్డి ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో అక్కడే విడిది చేయిస్తున్నాడు. గురువారం ఉదయం గొర్రె పిల్లలను ఓ డొడ్డిలో వేసి, మిగిలిన వాటిని మేపునకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం గొర్రెల దొడ్డిలోకి వీధి కుక్కలు చొరబడి దాడి చేయడంతో 24 గొర్రె పిల్లలు మృతి చెందాయి. సాయంత్రం తిరిగి వచ్చిన కాపరి మృతి చెందిన గొర్రె పిల్లలను గమనించి బోరున విలపించాడు. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి తెలిపాడు.
నీటి చౌర్యాన్ని అరికట్టాలి
● హెచ్చెల్సీ ఎస్‌ఈకి పండ్లతోటల రైతు సంఘం నాయకుల వినతి
అనంతపురం సెంట్రల్: పీఏబీఆర్ కుడికాలువ కింద అన్ని చెరువులను నీటితో నింపాలని జిల్లా పండ్లతోటల రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ను కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. పీఏబీఆర్ నుంచి కుడి కాలువ ద్వారా చెరువులకు విడుదల చేసిన నీటిని ఇటీవల పరిశీలించినట్లు తెలిపారు. అయితే కూడేరు మండలం సమీపంలో ఉదిరిపికొండ, వడ్డుపల్లి తదితర ప్రాంతాల్లో కొంతమంది కాలువకు గండ్లు కొట్టి నీటిని అనధికారికంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దీని వల్ల దిగువ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే నీటి చౌర్యాన్ని అరికట్టాలని విన్నవించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అనంతరాముడు, నారపరెడ్డి, ఆనంద్, మురళీమోహన్ చౌదరి, వెంకటేశ్‌చౌదరి, చల్లా రామాంజనేయులు, రంగాచారి తదితరులు పాల్గొన్నారు.
కుంభమేళాకు ప్రత్యేక రైలు
రాయదుర్గంటౌన్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడానికి ఇప్పటికే కోట్లాది మంది తరలివెళుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కుంభమేళా జరగనుంది. ఈ క్రమంలో నెలలో ఒక ట్రిప్పు చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో రాయదుర్గం, బళ్లారి మీదుగా మైసూరు–దానాపూర్–మైసూర్ ప్రత్యేక రైలును నడుపుతున్నారు. జనవరి 18, ఫిబ్రవరి 15, మార్చి 1 తేదీ శనివారాల్లో మైసూరులో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరిన రైలు (06207) బెంగళూరు, చిత్రదుర్గ, రాయదుర్గం, బళ్లారి కంటోన్మెంట్, హుబ్లీ, విజయపుర, సత్నా, ప్రయాగ్‌రాజ్ మీదుగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌కు చేరుకుంటుంది. అలాగే జనవరి 22న, ఫిబ్రవరి 19, మార్చి 5న బుధవారాల్లో దానాపూర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45 గంటలకు బయలుదేరిన రైలు (06208) అదే స్టేషన్ల మీదుగా మైసూరుకు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment