వరి సాగులో మెలకువలు పాటించండి
బుక్కరాయసముద్రం: జిల్లాలో రబీ సీజన్ కింద చేపట్టిన వరి సాగులో మెలకువలు పాటించాలని రైతులకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి సూచించారు. గురువారం ‘సాక్షి’తో ఆమె మాట్లాడుతూ... జిల్లాలో బోరు బావుల కింద వరి సాగుపై రైతులు దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలో నాణ్యమైన విత్తన ఎంపిక చాలా ముఖ్యమన్నారు. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండైజిం కలిపి 24 గంటల తరువాత నార మడిలో చల్లుకోవాలనాన్నారు. దంప నార మల్లక అయితే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండైమ్ కలిపి ఆ ద్రావణంలో వరి విత్తనాలను 24 గంటలు నానబెట్టి వరి మొలక వచ్చిన తరువాత నార మడులో చల్లుకోవాలన్నారు. ఎకరాకు 20 నుంచి 25 కిలోల వరి విత్తనం అసవరమవుతుందన్నారు. గరుకు భూముల్లో 30 కిలోలు వేసుకోవాలని సూచించారు. వరి మలక చల్లుకునే ముందు నార మడులను బాగా దుక్కి చేసుకోవాలన్నారు. మడిలో నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా ఏర్పాటు చేయాలన్నారు. 5 సెంట్ల నారమడికి 2 కిలోల నత్రజని ఒక కిలో భాస్వరం, ఒక కిలో పొటాష్ ఎరువులను నార మలక ముందు దుక్కిలో వేయాలన్నారు. మడిలో నార ఆకు పూర్తిగా విచ్చుకునే వరకూ పలచగా నీటి తడులు ఇస్తూ, తొలగిస్తూ ఉండాలన్నారు. నార మడులలో జింక్ లోపం ఉంటే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. నార విత్తనం వేసిన 10 రోజులకు కార్బోప్యూరాజిన్ 3జి లేదా 4జి గుళికలు సెంటు నారమడికి 160 గ్రాముల చొప్పున లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లేదా క్లోరోపైరిఫాస్ 2.0 మిల్లీ లీటరు నీటికి కలిపి 10 రోజులకు, 17 రోజులకు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. మడిలో నార తీసేందుకు 7 రోజుల ముందు కార్బోప్యూరాజిన్ గుళికలు వేయాలని, బీపీటీ వరి నార అయితే 2 నెలల తర్వాత నాటుకోవాలి. 1010 వరి రకం అయితే 30 రోజులకు నాటుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment