ఆర్టీసీ డిపో ఎస్టీఐ అక్రమాలపై విచారణ
ఉరవకొండ: స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్టీఐగా పనిచేస్తున్న రమణమ్మ విధుల్లో అక్రమాలకు పాల్పడినట్లు వెల్లువెత్తిన ఫిర్యాదులపై గురువారం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. డిపో ఆవరణలోని డీఎం కార్యాలయంలో రికార్డులను విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, సిబ్బంది పరిశీలించారు. ఎస్టీఐ రమణమ్మ వీక్లీ ఆఫ్ తీసుకున్నా తాను విధులు నిర్వర్తించినట్లు సంతకాలు పెడుతున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పాటు దొంగ మస్టర్‌లు సృష్టించి ఆర్టీసీ ఆదాయాన్ని పక్కదారి పట్టించినట్లు సమాచారం. దాదాపు 70 మంది ఆర్టీసీ కార్మికులు లిఖిత పూర్వకంగా ఎస్టీఐపై ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులు ఆకస్మాత్తుగా విచారణ చేపట్టారు.
రూఫ్ వాటర్ హార్వెస్టింగ్‌పై దృష్టి పెట్టండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: ఉపాధి పథకం కింద రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, వ్యక్తిగత, కమ్యూనిటీ సోక్ పిట్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి పథకం, పంచాయతీ సెక్టర్‌పై అధికారులతో వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధి పథకం కింద రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను పాఠశాలలు, సచివాలయ భవనాలు, ఎంపీడీఓ, తహసీల్దారు కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో వారానికి 25 వ్యక్తిగత సోక్ పిట్లు, వారానికి ఒకటి చొప్పున కమ్యూనిటీ సోక్ పిట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రీన్ అంబాసిడార్లకు వేతనాలు చెల్లించడంలో అలసత్వం వీడాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ సలీమ్‌బాషా, డీపీఓ నాగరాజునాయుడు, పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
అనంతపురం: నగరంలోని సాయినగర్ మొదటి క్రాస్, రామన్ స్కూల్ సమీపంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన మేరకు... రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమై గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రామన్ స్కూల్ వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 2,146 కిలోల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, పుట్టపర్తి మండలం బుగ్గపల్లికి చెందిన గుడిపాటి హరికృష్ణ, అనంతపురంలోని సాయినగర్ మొదటి క్రాస్‌కు చెందిన పసుపుల సురేష్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment