కళ్లు మూసుకున్నాం.. కొల్లగొట్టుకోండి!
జిల్లాలో చోరీలు ఆగడం లేదు.ఎక్కడో ఒక చోట దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీసులు తమ అసలు కర్తవ్యాన్ని మరిచి... ప్రజల భద్రతను గాలికొదిలేసి.. నిత్యం ప్రజాప్రతినిధుల సేవలోనే తరిస్తుండటంతో ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజానీకానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల వైఫల్యం సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. తాజాగా బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ‘రాజహంస స్వీట్‌హోం’ విల్లాస్‌లో జరిగిన అతిపెద్ద దోపిడీ జిల్లాలో దొంగల స్వైర విహారానికి అద్దం పట్టింది. ఈ క్రమంలోనే పోలీసుల నిస్సహాయతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల రక్షణను విస్మరించి రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ ఇప్పటికే ఖాకీలు అభాసుపాలయ్యారు.
‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ గాలికి..!
ఏదైనా పండుగ, పర్వదినాల సందర్భంలో కాలనీవాసులు ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊళ్లకు వెళ్తారు. అలాంటి సమయాల్లో ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచేలా ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ను ప్రవేశపెట్టారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ పద్ధతిని సమర్థవంతంగా అమలు చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ను పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో జిల్లాలో ఏటీఎంల లూటీ మొదలు భారీ దొంగతనాల వరకూ అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి.
అస్తమానం ఎమ్మెల్యేల సేవలోనే..
కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు పోలీసులు తమ అసలైన విధులు గాలికొదిలేసినట్టు విమర్శలున్నాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల సిఫార్సులతో పోస్టింగులు తెచ్చుకున్న సీఐలు.. ఎమ్మెల్యేల సేవలో తరిస్తున్నారు. 24 గంటలూ ప్రజాప్రతినిధుల పనులకే అంకితమవుతున్నారు. ఎమ్మెల్యేల మద్యం షాపులు, బెల్టుషాపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల చుట్టూనే వారి కార్యకలాపాలు ఉంటున్నాయి. దీనికితోడు స్టేషన్లలో సివిల్ పంచాయితీలు చేస్తూ తీరిక లేకుండా ఉంటున్నారు. దీంతోనే పోలీసు వ్యవస్థ డొల్లగా మారినట్టు తెలుస్తోంది.
‘డాకు’పై దృష్టి సామాన్యులపై లేదా?
ఈనెల 8న బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉంది.తిరుపతిలో తొక్కిలాట ఘటనతో వాయిదా వేశారు. అప్పట్లో ఫంక్షన్ కోసం 150 మంది పోలీసులు పహారా కాశారు. ఇప్పుడేమో శివారు ప్రాంతంలో భారీ దొంగతనం జరిగిన రోజే ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభకు వంద మందికి పైగా పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. సినిమా ఫంక్షన్‌పై ఉన్న శ్రద్ధ శివారు ప్రాంత కాలనీలపై ఉంటే ఇంత జరిగేది కాదని సామాన్యులు వాపోతున్నారు. రౌతు మెత్తనయితే గుర్రం మూడుకాళ్లపై పరిగెట్టిందన్న చందంగా.. ఎస్పీ చేతుల్లో నుంచి ఎమ్మెల్యేల చేతుల్లోకి సీఐలు వెళ్లిపోవడంతోనే వారి వ్యవహారాలకు అడ్డు లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ‘రాజహంస స్వీట్‌హోం’ విల్లాస్‌లో భారీ దొంగతనం జరిగేది కాదని నిపుణులు చెబుతున్నారు.
జిల్లాలో ఆగని దొంగతనాలు
గడిచిన కొన్ని నెలల్లోనే ఏటీఎంల లూటీ.. రకరకాల చోరీలు
తాజాగా ‘రాజహంస స్వీట్‌హోం’లో దొంగల బీభత్సం
పోలీసుల అప్రమత్తంగా లేకపోవడం వల్లే భారీ దోపిడీ
భద్రత కంటే ఎమ్మెల్యేల సేవలోనే తరిస్తున్న పోలీసులు
‘డాకు మహారాజ్’ సభకు వందమందితో పహారా
Comments
Please login to add a commentAdd a comment