క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు
అనంతపురం అర్బన్: ‘‘జవాబుదారీగా ఉంటూ క్రమశిక్షణతో పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఆ దిశగా విధులు నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా పనిచేయాలి. ముఖ్యంగా జిల్లాలో బాల్యవివాహాలు ఒక్కటీ జరగకుండా చూడాలి’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. ‘కౌమార సాధి కారత, బాల్యవివాహాల నివారణ’ అనే అంశంపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మిషన్ శక్తి’, ‘కిషోరి వికాసం’లో భాగంగా అనంత బాలికల స్వీయ రక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 100 పాఠశాలల్లో దాదాపు 50 వేల మంది బాలికలకు స్వీయ రక్షణ నైపుణ్యాలు, మానసిక సాధికారత, ఓవరాల్ డెవలప్‌మెంట్ అంశాలపై రెండో విడత అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. కౌమార బాలికల కోసం యూనిసెఫ్ రూపొందించిన పుస్తకాలను అందించాలని సూచించారు. బాల్యవివాహాలకు సంబంధించి జూలై 2023 నుంచి ఇప్పటి వరకు 544 కేసులు వచ్చాయన్నారు. ఇందులో 534 కేసులు నిరోధించగలిగారని, 10 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని వెల్లడించారు. 28 మందిని బైండోవర్ చేయాల్సి ఉండగా 24 మందినే చేశారని, మిగిలిన వారిని ఎందుకు చేయలేదని కలెక్టర్ ప్రశ్నించారు. వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. బాల్యవివాహాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి బాల్య వివాహ నిరోధక, పర్యవేక్షక కమిటీలను 15 రోజుల్లోపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీనేజీ వయసులో గర్భధారణ వల్ల తలెత్తే అనర్థాలపై గ్రామాల్లో, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని పనులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశానికి సభ్యులందరూ తప్పక హాజరవ్వాలన్నారు. గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీఈఓ ప్రసాద్‌బాబు, డీవీఈఓ వెంకటరమణ నాయక్, గిరిజన సంక్షేమశాఖాధికారి రామాంజినేయులు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, సంఘిక సంక్షేమ శాఖ జేడీ సూర్యప్రతాపరెడ్డి, బీసీ సంక్షేమాధికారి కుష్బూకొఠారి, ఐసీడీఎస్ పీడీ వనజ అక్కమ్మ, డీపీఓ నాగరాజు నాయుడు, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, డీఐపీఆర్‌ఓ గురుస్వామిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జవాబుదారీగా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు
కలెక్టర్ వినోద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment