సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు ఉద్దేశించిన పోషణ్ అభియాన్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పథకం మొత్తం అమలులో అత్యధిక విజయాలు సాధించిన రాష్ట్రాల్లో తొలుత మహారాష్ట్ర నిలవగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో గుజరాత్ నిలిచాయి.
ఈ రాష్ట్రాలు మొత్తం మీద 70 శాతానికి పైగా స్కోర్ సాధించాయి. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ఉన్నట్లు నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కోవిడ్ సమయంలో కీలకమైన ఆరోగ్య, పోషకాహార సేవల విషయంలో ఆయా రాష్ట్రాలు చేపట్టిన వినూత్న చర్యలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది.
2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ 2020 వరకు పోషణ్ అభియాన్ అమలులో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, శిక్షణపై పురోగతి, అమలు సామర్థ్యాలు, కెపాసిటీ బిల్డింగ్, కన్వర్జెన్స్, ప్రోగ్రామ్, ఔట్‌పుట్ యాక్టివిటీస్, సర్వీస్ డెలివరీలపై నీతి ఆయోగ్ అధ్యయనంచేసి ఆయా రాష్ట్రాలకు స్కోర్లు ఇచ్చింది. ఆ వివరాలు..
మానవ వనరుల నియామకాల్లో ఏపీ టాప్
► కోవిడ్ సమయంలో పోషణ్ అభియాన్ అమలుకు అవసరమైన మానవ వనరుల నియామకాలను నూరు శాతం చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. జాయింట్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ స్థానాలనూ నూరు శాతం భర్తీచేసిన రాష్ట్రాల్లో ఏపీ ఈ ఘనత సాధించింది. అంగన్‌వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను నూరు శా>తం పంపిణీలోనూ ఏపీ టాప్‌లో నిలిచింది. పిల్లల వృద్ధి పర్యవేక్షణ పరికరాలనూ నూటికి నూరు శాతం ఏపీ పంపిణీ చేసింది. అంతేకాక.. రాష్ట్రస్థాయిలో సిబ్బంది శిక్షణ, సామర్థ్యం పెంపునూ నూరు శాతం అమలుచేసింది.
► ఆరోగ్య సంబంధిత సేవలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అంచనా వేయగా.. కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, పిల్లలు, బాలింతలకు సేవలు, ఏఎన్‌ఎంల భర్తీలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక స్కోర్ సాధించింది. ఆ తరువాత స్థానాల్లో గుజరాత్, కర్ణాటక, కేరళ నిలిచాయి.
► రాష్ట్రస్థాయిలో మౌలిక సదుపాయాలకు సంబంధించి సబ్ సెంటర్లు, కకమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో నూటికి నూరు శాతం పనిచేస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోని 13 పెద్ద రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది.
► ఏపీ సర్కారు ప్రత్యేకంగా సప్లిమెంటరీ పోషకాహారం కూడా పంపిణీ చేసింది. గృహ సందర్శనలు, వర్చువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పిల్లలకు వర్చువల్ తరగతులు నిర్వహించింది. కమ్యూనిటీ పద్ధతిలో వర్చువల్ ఈవెంట్లనూ నిర్వహించింది. కోవిడ్ సమయంలో జనసమూహాన్ని నివారించేందుకు టోకెన్ ఆధారిత వ్యవస్థ ద్వారా జింక్, ఓఆర్‌ఎస్‌లను పంపిణీ చేసింది.
► కోవిడ్ సంక్షోభ సమయంలో అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు గల పిల్లలకు సప్లిమెంటరీ పౌష్టికాహారం ఏపీలో 113 శాతం మేర పంపిణీ చేయగా 2020 మూడో త్రైమాసికం నాటికి అది 115 శాతం మేర.. నాలుగో త్రైమాసికం నాటికి అది 119 శాతానికి పెరిగింది.
► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు గర్భిణులతో పాటు పాలు ఇచ్చే తల్లులకు సప్లిమెంటరీ పౌష్టికాహారం పంపిణీ 108 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికానికి 111 శాతం, 2020 నాలుగో త్రైమాసికంలోనూ అదే స్థాయిలో పంపిణీ జరిగింది.
► ఇక అక్టోబర్ 2019 నుంచి 2020 రెండో త్రైమాసికం వరకు ఇనిస్టిట్యూషనల్ కాన్పులు ఏపీలో 90 శాతం ఉండగా 2020 మూడో త్రైమాసికంలో 94 శాతానికి.. 2020 నాలుగో త్రైమాసికానికి 100 శాతానికి పెరిగాయి.
Poshan Abhiyaan: ‘పోషణ్ అభియాన్’ అమల్లో ఏపీ భేష్
Published Sun, Sep 4 2022 4:56 AM | Last Updated on Sun, Sep 4 2022 8:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment