స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పాల్గొన్న అధికారులు
‘దేవుడి దయవల్ల కరోనా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ నియంత్రణలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. అందులో భాగస్వాములైన కలెక్టర్లు మొదలుకుని చివరి స్థాయిలో ఉన్న వలంటీర్లు, ఆశ వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది.. ఇలా అందరూ కృషి చేశారు. దీనివల్ల మంచి ఫలితాలొచ్చాయి. వారందరికీ అభినందనలు’
‘104 కాల్ సెంటర్ వన్‌స్టాప్ సొల్యూషన్ కావాలి. కోవిడ్ పరీక్షలు, వైద్యం, ఆస్పత్రుల్లో అడ్మిషన్.. ఇలా ఏ సేవలైనా 104 ద్వారా అందాలి. ఫోన్ చేసిన 3 గంటలలోపు ఆ వ్యక్తికి సేవలందాలి. లేదంటే కలెక్టర్లు, జేసీలు సక్రమంగా పనిచేయడం లేదని భావించాల్సి వస్తుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావుండకూడదు’
సాక్షి, అమరావతి: వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్ సమస్యకు పరిష్కారమని, అది నూరు శాతం విజయవంతమయ్యే వరకు జాగ్రత్తలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో మనం చాలా దూరంలో ఉన్నామన్నారు. మహమ్మారి అంతమయ్యే వరకు నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. భవిష్యత్‌లో మనం తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను మరిచిపోకూడదని సీఎం చెప్పారు. టీకా ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తయ్యేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అన్నీ తెరచుకుంటున్నాయని.. ఆంక్షల విషయంలో అన్ని రాష్ట్రాల్లో సారూప్యత లేదని, అందుకనే కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని సీఎం అన్నారు. 45 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తర్వాత మిగిలిన కేటగిరీల వారిపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, జాగ్రత్తలు, చికిత్స, థర్డ్‌వేవ్ సన్నద్ధతలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్పందనలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే...
ఫీవర్ సర్వే, టెస్టులు, సేవల్ని నిరంతరం కొనసాగించండి
► 6 నుంచి 7 వారాల వ్యవధిలో ఇంటింటికీ వెళ్లి దాదాపు పదిసార్లు ఫీవర్ సర్వేలు నిర్వహించాం. వీటిని నిరంతరం కొనసాగించాలి. జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి.
► కోవిడ్ టెస్టులు నిరంతరం జరుగుతుండాలి. అవి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే నిర్వహించాలి.
► కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సిబ్బంది పనితీరుతో పాటు నాణ్యమైన భోజనం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి. ఈ అంశాలపై కనీసం 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించాలి. పేద రోగులకు కచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.
► ప్రస్తుతం 322 ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందుతున్నాయి. 4,592 ఐసీయూ బెడ్స్‌లో 3,196 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 19,258 ఆక్సిజన్ బెడ్స్‌కు గానూ, 15,309 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు లెక్క.
థర్డ్ వేవ్‌పై కార్యాచరణ
► థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో మనం సిద్ధంగా ఉండాలి.
► అన్ని బోధానాస్పత్రుల్లో చిన్న పిల్లల బెడ్స్ ఉన్నాయా? లేదా ? చూసుకోవాలి. వారికి ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేయాలి.
► రానున్న రెండు నెలల్లో దీన్ని అమలు చేయాలి. మందుల కొరత లేకుండా చూడాలి. జిల్లాల పరిధిలో ఉన్న పీడియాట్రీషియన్ల వివరాలు సేకరించాలి. అవసరమైతే వారి సేవలు వినియోగించుకోవాలి.
► చిన్న పిల్లలకు చికిత్స, వైద్యం విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి.
ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడాలి
► ఇకనుంచి ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడాలి. ఇది జరగకపోతే పేదలు దెబ్బతింటారు.
► అందుకే 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపులు ఇచ్చాం. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్లాలి.
16 కొత్త బోధనాస్పత్రులు
► ప్రభుత్వ పరంగా 16 కొత్త బోధనాస్పత్రులు నిర్మిస్తున్నాం. 11 పాత మెడికల్ కళాశాలలను కూడా నాడు–నేడులో ఆధునికీకరిస్తున్నాం. జాతీయ స్ధాయి ప్రమాణాలకు దీటుగా వీటిని అభివృద్ధి చేస్తున్నాం. మూడేళ్ల కాలంలో రూ.100 కోట్లు ఆస్పత్రి రూపేణా పెట్టుబడి పెట్టాలి. వీటివల్ల అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. వారం రోజుల్లోగా వీటికి కలెక్టర్లు భూమిని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment